ములుగు రూరల్, జూలై 18 : కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో కటాఫ్ తేదీ నిర్ణయించడం సరైంది కాదని, రుణమాఫీని రైతులందరికీ వర్తింపజేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున్‌రావు అన్నారు. గత ప్రభుత్వంలో మిగిలిన రుణాలను కూడా మాఫీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నారని గుర్తుచేశారు. గురువారం పార్టీ ఆధ్వర్యంలో ములుగు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి మాట్లాడారు. గతంలో రుణమాఫీ తర్వాత మిగిలిన రుణాలన్నింటిని కూడా ప్రస్తుతం మాఫీ చేయాలని, రీషెడ్యూల్ రుణాలకు కూడా వర్తింజేయాలని డిమాండ్ చేశారు.
పహాణి నకల్ ద్వారా పొందిన రుణాలను కూడా మాఫీ చేసి భూ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆసరా పింఛన్లను పెంచుతామన్న హామీని నెరవేర్చాలని కోరారు. పేదలకు గృహ నిర్మాణాల కోసం ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందించాలని, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని, మ్యానిఫెస్టోలోని హామీలను అమలు చేయాలని అన్నారు. ధర్నాలో జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్, నాయకులు ఐలయ్య, ఇంజం కొమురయ్య, అమ్జద్‌పాషా, నర్సయ్య, శ్రీనివాస్, గణేశ్, శ్యాంసుందర్, రమేశ్, నటరాజ్, లక్ష్మి, సదయ్య, రాజన్న, పరమ్‌సింగ్, సమ్మయ్య పాల్గొన్నారు.