చిల్పూర్ : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ శుక్రవారం స్టేషన్ ఘన్పూర్ డివిజన్ పరిధిలోని చిల్పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, సీపీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలను సంబంధిత స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సిరిపురం నవీన్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో అత్యధికంగా ఎలాంటి నేరాలు నమోదవుతాయి.
స్టేషన్ పరిధిలో ఎన్నిసెక్టార్లు వున్నాయి, సెక్టార్‌వారీగా సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, వారి పరిధిలోని రౌడీ షీటర్లు, అనుమానితులు వారి ప్రస్తుత స్థితి గతులను సిబ్బందిని అడిగి తెలిసుకోవడంతో పాటు స్టేషన్‌వారీగా బ్లూకోట్స్ సిబ్బంది పనితీరును స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకై విజుబుల్ పోలీసింగ్ అవసరమని, ఇందుకోసం నగరంలో నిరంతం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని సీపీ స్టేషన్ అధికారులకు సూచించారు. ఆయన వెంట వెస్ట్ జోన్ జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్, స్టేషన్ ఘన్ పూర్ ఏసీపీ భీంశర్మ, సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.