శాయంపేట, ఆగస్టు 16 ః తెల్లబంగారాన్ని నమ్ముకొని తొలకరితోనే విత్తులు పెడితే ప్రకృతి పగబట్టింది. పూత, కాత దశకు రావాల్సిన పత్తి ఎల్నినో ప్రభావంతో వానల్లేక, తడి అందక వాడిపోతున్నది. వేసవిని తలపిస్తున్న ఎండలతో విత్తనాలు మాడిపోతున్నాయి. మండలంలోని సూరంపేట, గట్లకానిపర్తి, మాందారిపేట, పత్తిపాక, జోగంపల్లి, పెద్దకోడెపాక, నేరేడుపల్లితో పాటు పలు గ్రామాల్లో రైతులు రెండు, మూడోసారి కూడా పత్తి విత్తులు నాటి ఆర్థికంగా అదనపు ఖర్చు భరించారు. అయితే, మొలకలొచ్చినా వానల్లేక, నీళ్లు అందక పంట ఎదగలేదు.
ఇంకా శాయంపేట, పత్తిపాక, మైలారం, సూరంపేట, జోగంపల్లి, పెద్దకోడెపాక,ఆరెపల్లి, నర్సింహులపల్లి, గట్లకానపర్తి తదితర గ్రామాల్లో పత్తి పంట వడలిపోయింది. అప్పుడప్పుడు పడుతున్న ముసురుతో పత్తిలో గడ్డి పెరగడం తప్ప.. మొక్కలు ఎదగడం లేదు. దీంతో కొందరు రైతులు కలుపు తీయించక వదిలేస్తున్న పరిస్థితులున్నాయి. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పత్తికి నీళ్లు పారించే పరిస్థితి లేదు. ఎన్నో ఆశలతో పత్తి పంట సాగుకు విత్తనాలు, కూలీలు, ఎరువులు, దుక్కులకు వేలాది రూపాయలను ఖర్చు చేశారు. కానీ, వానలు లేకపోవడంతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు.
ఎన్నో ఆశలతో తొలకరితోనే నాలుగు ఎకరాల్లో పత్తిని సాగు చేశాను. రెండు, మూడు సార్లు విత్తనాలు పెట్టా. రెండు నెలలు గడిచింది. ఇప్పటికే పూత దశలో ఉండాల్సిన పంట ఎదగలేదు. ఫీటు వరకే మొక్కలు పెరిగాయి. అరకొర వానలతో కలుపు తీయించలేదు. ఇప్పటికే నాలుగెకరాలకు రూ.లక్ష ఖర్చుచేసినా పంట పండే పరిస్థితి లేదు. ఆశించిన వానల్లేవు. నష్టపోవాల్సి వస్తున్నది.
– అడుప ప్రభాకర్,సూరంపేట రైతు