హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): 2026-27 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ (క్యూ3) వరకు రూ.13,000 కోట్ల రుణం ఈ-వేలం ద్వారా తీసుకుంటామని తెలంగాణ సర్కార్ ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపించింది. ఈ మేరకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మారెట్ నుంచి సమీకరించనున్న రుణాల కోసం భారత రిజర్వు బ్యాంకు శుక్రవారం సూచిక క్యాలెండర్ను ప్రకటించింది.
ఈ త్రైమాసికంలో మొత్తం రూ.3,60,820 కోట్ల మేర మారెట్ రుణాలు సమీకరించనున్నట్టు అంచనా వేసింది. అయితే, తెలంగాణ రాష్ర్టానికి సంబంధించి 2026-27 వార్షిక రుణ లక్ష్యం రూ.58,458.71 కోట్లు కాగా, ఇప్పటికే తొలి త్రైమాసికం (క్యూ-1 ఏప్రిల్-జూన్)లో రూ.18,900 కోట్లు, రెండో త్రైమాసికం (క్యూ-2 జూలై-సెప్టెంబర్)లో రూ.27,500 కోట్లు.. మొత్తం కలిపి రూ.46,400 కోట్ల రుణ సమీకరణ చేశారు. వార్షిక రుణ లక్ష్యంలో ఇప్పటికే దాదాపు 80% మేరకు తీసుకున్నారు. మూడో త్రైమాసికం కింద మరో రూ.13,000 కోట్ల అప్పు తీసుకుంటామని ప్రతిపాదించారు.
మూడు త్రైమాసికాలు కలిపితే మొత్తం రుణం రూ.59,400 కోట్లకు చేరనున్నది. వార్షిక రుణ లక్ష్యం రూ.58,458.71 కోట్లు కాగా, డిసెంబర్ నాటికే రుణ లక్ష్యానికి మించి రూ.1,000 అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. చివరి క్వార్టర్ జనవరి-మార్చిలో మరో రూ.10-15 వేల కోట్ల అప్పు తీసుకొనే అవకాశం లేకపోలేదని గత ఏడాది పరిస్థితులను బట్టి ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ర్టానికి వచ్చే ఆదాయం కంటే అప్పుల సేకరణ వేగం చాలా ఎక్కువగా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.