వరంగల్, మార్చి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. గతంలో మంజూరైన పనులకు బిల్లు లు చెల్లించడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉన్నది. నిధుల మంజూరు లేకపోవడంతో వరంగల్ నగరంలో అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయి. గతంలో మంజూరైన పనులు చేసిన వారి పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నది. వారంలో ఆర్థిక సంవత్సరం ముగియనున్నది.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పన్నుల వసూలు జోరుగా జరుగుతున్నది. రోజువారీగా పోగైన నిధులను జీడబ్ల్యూఎంసీ తక్కువ బడ్జెట్తో పూర్తయిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి పనుల బిల్లుల చెల్లింపులు చేస్తున్నది. ఈ చెల్లింపుల్లో జీడబ్లూఎంసీలోని ఉన్నతాధికారులు దందా మొదలుపెట్టారు. తేదీల పరంగా పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కమీషన్లు ఇచ్చిన వారి బిల్లులనే ఓకే చేస్తున్నారు. జీడబ్ల్యూఎంసీ సాధారణ నిధుల నుంచి రెండు రోజుల్లోనే రూ.10 కోట్ల బిల్లులు చెల్లించగా గ్రేటర్ పరిధిలోని ఓ ఎమ్మెల్యే సూచించిన కొందరికి ఏకంగా రూ.8 కోట్లు చెల్లించినట్లు తెలిసింది.