Mulkanuru | భీమదేవరపల్లి : భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సహకార సంఘాలది కీలక పాత్ర అని ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు. ముల్కనూరు మహిళా సహకార డెయిరీలో సహకార వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సహకార వ్యవస్థాపకత ద్వారా హస్తకళలు, చేనేత, కార్మిక, మత్స్య సంపదతో సహా యువత, మహిళలు, బలహీన వర్గాల సాధికారత, ప్రపంచ పోటీ శక్తికి అనుగుణంగా సహకార వ్యాపార నమూనాలలో ఆవిష్కరణ తదితర అంశాలపై సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని చెప్పడానికి ముల్కనూరు మహిళా డెయిరీనే నిదర్శనం అన్నారు. మహిళలు ఆర్థిక, స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి వారి సామాజిక ఆర్థిక ఎదుగుదలకు ఎంతో దోహద పడుతున్నారని ప్రశంసించారు. రైతులు బలహీనవర్గాల ఆర్థిక అవసరాలకు సహకార సంఘాలు బలం చేకూరుస్తాయనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. సహకార సంఘాలు బలోపేతం అయితే దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థ ధృడ పడుతుందన్నారు. సహకార సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఎదుగుదలకు పునాది వంటివని చెప్పారు. వ్యక్తులు తమ స్వార్ధ చింతన వీడి, సమూహంగా ఏర్పడి నిష్పక్షపాతంగా పనిచేస్తే సంఘం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. సహకార సంఘాల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముల్కనూరు మహిళా సహకార డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ, జీఎం మార్పాటి భాస్కర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, పాల సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.