జనగామ జిల్లాలోని పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల పనులకు పట్టిన గ్రహణం వీడడం లేదు. నిధులుండీ పనులు ముందుకు సాగక.. ఎమ్మెల్యే పట్టించుకోక ఎదురుచూపులు తప్పడం లేదు. ఉప్పుగల్లుదీ అదే పరిస్థితి. అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పనుల్లో జాప్యం కొనసాగుతున్నది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో వీటి పనులు ప్రారంభమైనా.. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు రిజర్వాయర్లపై శ్రద్ధ చూపి భారీగా నిధులు కేటాయింపు జరిగేలా చూశారు. అప్పుడు జరిగిన పనులే తప్ప ప్రస్తుత కాంగ్రెస్ సర్కారులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. స్థానిక ఎమ్మెల్యే సమీక్షలకే పరిమితం కాగా, బిల్లులు రావడం లేదంటూ కాంట్రాక్టర్లు తప్పుకొంటున్నారు. రిజర్వాయర్లు అందుబాటులోకి వస్తే తమ బతుకులు బాగుపడతాయనుకున్న అన్నదాతలు ఇంకెప్పుడు పనులు పూర్తిచేస్తారని
– పాలకుర్తి, జూలై 16
కాంగ్రెస్ ప్రభుత్వంలోని భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఫిబ్రవరి 27, 2009న పాలకుర్తి, చె న్నూరు, ఉప్పుగల్లు రిజర్వాయర్ల పనులకు భూమి పూజ చేశారు. గోదావరి జలాలతో ఈ రిజర్వాయర్లను సాగు నీరందించాలని అప్పుడు సంకల్పించినప్పటికీ పనులు మాత్రం ముం దుకు సాగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2016లో ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్రావు బీఆర్ఎస్లో చేరి రిజర్వాయర్ల నిర్మాణ పనులకు రూ. 370 కోట్లు కేటాయించేలా కృషి చేయడంతో పాటు భూ సేకరణ సైతం పూర్తిచేశారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పనుల్లో వేగం పెంచారు. దీంతో చెన్నూరు రిజర్వాయర్ 90 శాతం, పాలకుర్తి జలాశయం పనులు స గం వరకు పూర్తయ్యాయి.
0.25 టీఎంసీల సామర్థ్యంతో పాలకుర్తి, 0.58తో చెన్నూరు, 0. 35 టీఎంసీలతో ఉప్పుగల్లు రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇవి పూర్తయితే 77,890 ఎకరాలకు సాగు నీరందనుంది. ఇందులో చెన్నూరు కింద 25 వేలు, పాలకుర్తి కింద 7,500, ఉప్పుగల్లు కింద 35 వేల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రిజర్వాయర్ల పనుల్లో ఒక్క అడు గు కూడా ముందుకు పడలేదు. పట్టించుకోవాల్సిన స్థాని క ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి సమీక్షలతో సరిపెడుతున్నారే తప్ప నిధులు తేవడం లేదు. అయితే అరకొరగా పనులు జరుగుతున్నా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పక్కకు తప్పుకుంటున్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి మిగిలి ఉన్న మూడు రిజర్వాయర్ల పనుల కోసం రూ. 1,015 కోట్లు మంజూరు చేయాలని అసెంబ్లీలో కోరడం చర్చనీయాంశంగా మారింది. పైగా జలాశయాల కింద కాల్వల నిర్మాణానికి భూ సేకరణ కూడా చేయడం లేదని వాపోతున్నారు. రిజర్వాయర్లు పూర్తయితే ఏటా రెండు పంటలు పండుతాయని ఆశపడ్డామని, పనుల్లో జాప్యంతో ఒక్క పంట కూడా వేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. రిజర్వాయర్లు పూర్తి కాక, చెరువుల్లో నీళ్లు లేక, బావు లు, బోర్లలో జలాలు అడుగంటి పొలాలు పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి సమీక్షలను పక్కన పెట్టి ఉన్న నిధులతో పనులు పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నా రు. ప్రస్తుతం పనులు నత్తనడకన సాగుతున్నాయని, వా టిలోనూ నాణ్యత లేదని రైతులు మండిపడుతున్నారు. సకాలంలో బిల్లులు చెల్లిస్తే రిజర్వాయర్ పనులను ఆరు నెలల్లో పూర్తి చేస్తానని కాంట్రాక్టర్ చెప్పడం గమనార్హం.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి పట్టింపు లేని తనంతోనే రిజర్వాయర్ల పనులు ఆలస్యమవుతున్నాయి. ఉన్న నిధులు సరిపోనట్లు ఎమ్మెల్యే మరో రూ. 1,015 కోట్లు కావాలని అడగడం ఆశ్చర్యంగా ఉంది. సొంత నిధులతో కాల్వలు తీస్తున్నా అని చెప్పుకునే ఎమ్మెల్యే రిజర్వాయర్ల పనులను ఎందుకు పట్టించుకోవడంలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు త్వరగా జరిగాయి. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారులో అసలు పనులే జరగడం లేదు. ఎమ్మెల్యేకు రైతులపై ప్రేముంటే వెంటనే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించి పనులు పూర్తి చేయించాలి. రిజర్వాయర్లు లేక పంటలు ఎండుతున్నాయి. ప్రస్తుత వానకాలంలో పనులు ఎట్లా సాగుతాయి.
– మల్యాల పరశురాములు, రైతు, లక్ష్మీనారాయణపురం
చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల నిర్మాణానికి గత ప్రభుత్వం రూ. 470 కోట్లతో ప్రతిపాదనలు పంపింది. అందులో రూ. 370 కోట్లు మంజూరు కాగా పనులు చేపట్టాం. పాలకుర్తి రిజర్వాయర్ కింద 3.45 కిలోమీటర్ల మేర కట్ట నిర్మించాల్సి ఉండగా 1.8 కిలో మీటర్ల మేర మాత్రమే పనులు జరిగాయి. చెన్నూరు రిజర్వాయర్ కింద 7 కిలోమీటర్ల మేర మెయిన్ కెనాల్ పూర్తయింది. రివిట్మెంట్ చేయాల్సి ఉంది. త్వరలోనే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
– శ్రీకాంత్శర్మ, ఐబీ డీఈఈ