మహదేవపూర్, మార్చి 28 : ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ఇచ్చిన వాటర్ బాటిళ్లలో నీరు కలుషితమైందని ప్రయాణికులు ఆరోపించారు. శుక్రవారం కాళేశ్వరం నుంచి హనుమకొండకు మహదేవపూర్ గుండా వెళ్తున్న టీఎస్ 25 జడ్ 0034 నంబర్ గల సూపర్ లగ్జరీ బస్సులో కలుషిత వాటర్ చూసి కంగుతిన్నారు. మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామానికి చెందిన పుట్ట సూర్యనారాయణతో పాటు పలువురు ఇదేంటని ప్రశ్నించారు. డ్రైవర్ తన కేమీ సంబంధం లేదని టికెట్ కొన్న ప్రతి ఒక్కరికి ఈ వాటర్ బాటిల్ ఇస్తామని చెప్పాడు.
ఏమైనా ఇబ్బంది ఉండే వాటర్ బాటిల్‌తో ఫొటో దిగి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు. టికెట్లో వాటర్ బాటిల్‌కు అదనంగా రూ.10 తీసుకుంటున్నపుడు కలుషిత నీటిని అందిస్తే అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆర్టీసీ భూపాలపల్లి డిపో మేనేజర్‌ను వివరణ కోరగా బస్సులో కలుషిత వాటర్ బాటిల్ ఇచ్చారని సమాచారం అందడంతో బస్టాండ్‌లో బస్సును నిలిపి అందులో ఉన్న వాటర్ బాటి ళ్లను వెనక్కి తీసుకొని మార్చి ఇచ్చామన్నారు. వాటర్ శాంపిళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపిస్తామన్నారు. ఇది వరకు ఎన్నడూ ఇలా జరగలేదని, ప్రయాణికుల నుంచి ఫిర్యాదు రావడం ఇదే మొదటిసారని తెలిపారు.