హనుమకొండ చౌరస్తా, జూలై 16 : ఓరుగల్లు కళాకారులకు పుట్టినిల్లు అని, సీఎం కేసీఆర్ కళారంగానికి పెద్ద పీట వేస్తున్నారని కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అన్నారు. ఆదివారం హనుమకొండలోని పబ్లిక్‌గార్డెన్ నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం-తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ, అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ నాట్యగురువుల శతజయంతి ఉత్సవాల సందర్భంగా అకాడమీ 18వ వార్షికోత్సవం, ‘బంగారు తెలంగాణలో పేరిణి నృత్యం-2023’ పేరుతో పేరిణి నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో 80 మంది పేరిణి నృత్యకళాకారులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కళాకారులకు అండగా నిలుస్తున్నారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కళాకారులను పట్టించుకోలేదన్నారు. నగరంలో రూ.75 కోట్లతో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. త్వరలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
వచ్చే ఏడాది నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు కాళోజీ కళాక్షేత్రంలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. పేరిణి నృత్యవ్యాప్తికి విశ్వనాట్యగురువు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ సేవలు మరువలేనివన్నారు. ఆ పరంపరను కొనసాగించడానికి వరంగల్లులో నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ స్థాపించి, వేలాది మంది శిష్యులకు ఈ నాట్యకళలో అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న గజ్జల రంజిత్‌కుమార్, నవ్యజ దంపతులు అభినందనీయులని అన్నారు. నిమ్మల శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యప్రదర్శన ఆహుతులను రంజింపజేసింది. ప్రతిభ కనబర్చిన అకాడమీ విద్యార్థులు బండారు తేజస్విని, సలేంద్ర సాహితీప్రియ, జీ హన్సికారెడ్డి, కడార్ల స్నావెస్లా, ఇప్పకాయల సింధుకు అతిథుల సమక్షంలో ప్రతిభా పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి అకాడమీ గౌరవాధ్యక్షుడు డాక్టర్ బందెల మోహన్‌రావు అధ్యక్షత వహించగా అధ్యక్షుడు మోత్కూరి చంద్రకళా రామకృష్ణ, ఏసీపీ వీ కిరణ్‌కుమార్, న్యాయవాది అల్లం నాగరాజు, డీపీఆర్వో లక్ష్మణ్, విధుమౌళి, పీవీ మదన్మోహన్, కుసుమ కవిత, బొమ్మ నాగరాజు, ఆకుల సదనందం, డాక్టర్ హరి సనత్‌కుమార్, చార్టెడ్ అకౌంటెంట్ గోపీచంద్ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న పేరిణి నృత్యాలు..
పేరిణి నృత్యంలోని లాస్యం తాండవంలో డాక్టర్ నటరాజ రామకృష్ణ రూపకల్పన చేసిన అంశాలు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుగ్రహీత కళాకృష్ణ రూపకల్పన చేసిన పేరిణి నృత్యలాస్య అంశాలను మొదట పరంపరగా ప్రదర్శించిన తర్వాత వరంగల్ కళాకారులు గజ్జల రంజిత్-నవ్యజ నాట్య దంపతులు రూపకల్పన చేసిన కొత్త అంశాల ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. తెలంగాణలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబపై రూపకల్పన చేసిన పేరిణి లాస్య అంశం పండితులను మెప్పించింది. శ్రీసుందరం వల్లి శ్రీదేవి రచించిన శక్తిగానలహరి సంకీర్తనలలో బాసర సరస్వతిపై రాసిన ‘అక్షర రూపిని గిర్వాణి’ అనే కీర్తనలకు అపూర్వ ఆదరణ లభించింది. శివునికి సంబంధించిన ‘భో శంభో’ అంశం దయానంద సరస్వతి రచనకు పేరిణి నృత్యం చేస్తుంటే సాక్షాత్తు శివుడు కనిపించినట్లుగా అందరూ మంత్రముగ్దులయ్యారు. ఇందులో ‘మహాదేవ శంభో’ అనే అంశాన్ని తంజావూరు శంకరం అయ్యర్ రచనకు స్త్రీ లాస్యాలతో పేరిణి నృత్యప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముందుగా సంప్రదాయ ఆంధ్రనాట్యంలోని కుంభహారతి, పుష్పాంజలి, గణపతి కౌత్వం, శివకౌవారం నర్తనాలు ప్రదర్శించిన తర్వాత జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సహకార వాయిద్యంగా మృదంగంపై ఏ విశ్వనాథ్, వయోలియన్ టీ చిన్నికృష్ణ, గాత్రం ఆర్ శ్రవణ్రాజ్, సాయిచరణ్ పాల్గొన్నారు.