మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు.. వాటిని నెరవేర్చకపోవడమే గాక ఏడాది పాలనపై విజయోత్సవాలు జరుపడం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారింది. ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు అంటూ ఊదరగొట్టి రుణమాఫీ, పింఛన్, రేషన్‌కార్డు, ఆడబిడ్డలకు రూ.2,500, తులం బంగారం.. ఇలా ఏ ఒక్కటీ అమలుకాకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
ఈ క్రమంలో ‘విజయోత్సాహం’ అటుంచి.. ప్రజలు హామీలపై నిలదీస్తారనే భయం కారణంగా మంత్రు లు సహా ఎమ్మెల్యేలంద రూ అధికారిక కార్య క్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏడాది పాలన ఉత్సవాలను విజయవంతం చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి పిలుపు నిచ్చినప్పటికీ క్షేత్రస్థాయి లో ప్రజాగ్రహాన్ని చవిచూ డాల్సి వస్తుందనే ఆందోళనే వారిని వెంటాడుతున్నది.
– వరంగల్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు వాటిని అమలు చేయకపోవడంతో ప్రజలలో అసంతృప్తి పెరుగుతున్నది. అరకొరగా రుణమాఫీ చేయడం, ఆసరా పింఛన్ల మొత్తం పెంచకపోవడం, కొత్త రేషన్‌కార్డులు ఇవ్వకపోవడం, మహిళలకు ప్రతి నెల రూ.2,500, పేద ఆడబిడ్డ పెండ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం వంటి ముఖ్యమైన హామీలతో పాటు వేటినీ నెరవేర్చకపోవడంపై ప్రజలు రోడ్డెక్కి ప్రశ్నించేదాకా వచ్చింది.
ఇదే సమయంలో ప్రభుత్వం ఆర్భాటంగా ఏడాది పాలన ఉత్సవాల కార్యక్రమం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి వరుసగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందరు ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని మంత్రులతో పాటు అత్యధిక మంది ఎమ్మెల్యేలు ప్రజాపాలన ఏడాది ఉత్సవాల కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. కాంగ్రెస్ హామీలపై ప్రజలు నిలదీస్తారనే ఆందోళనతోనే ఎమ్మెల్యేలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సొంత నియోజకవర్గాల్లో నిర్వహించే ఈ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.
మంత్రి సురేఖ గురువారం ఒక్కరోజే నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలకు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన కార్యక్రమాలు ఏమీ లేవు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమాండ్ల యశస్వినీరెడ్డి, కే ఆర్ నాగరాజు, కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వ ఏడాది ఉత్సవాల కార్యక్రమాలకు పూర్తిగా దూరం ఉంటున్నారు. ఇక డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రూనాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే కార్యక్రమాలకు పరిమితమవుతున్నారు. ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలెవరూ పర్యటించడం లేదు.
అధికారంలోకి రాగానే రూ.2 లక్షల్లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తవుతున్నా రుణమాఫీ విషయంలో అయోమయం నెలకొన్నది. ఎవరికి మాఫీ అయ్యింది?, దాని ప్రాతిపాదిక ఏమిటో తెలియక రైతులు ఆగమవుతున్నారు. రుణమాఫీ ప్రక్రియ ముగిసిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడంతో ఎక్కువ మంది రైతుల్లో ఆందోళన పెరిగింది. రుణాలు మాఫీ కాని వారే ఎక్కువ మంది ఉన్నారని ప్రతి ఊరిలోనూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాలుగు దశలుగా కొందరికే మాఫీ చేయడం సరికాదని అంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ రుణమాఫీ విధానంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పెట్టి తమను ఆగం చేశారని రైతులు వాపోతున్నారు. ప్రతి రైతు పంట రుణాలను మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక నిబంధనలు పెట్టి ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌కార్డు, కుటుంబం వంటి నిబంధనలు రైతులను ఇబ్బంది పెట్టేందుకేనని.. ఈ కారణాలతో లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయకుండా ప్రభుత్వం ఎగవేసిందని చెబుతున్నారు.