హనుమకొండ, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాం గ్రెస్ గ్రూపు పంచాయతీ ముదురుతున్న ది. పార్టీ కీలక కార్యక్రమాల్లోనూ కాంగ్రె స్ ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీ-పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఏర్పాట్లలో అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. వర్ధన్నపేట నియోజకవర్గంలో సోమవారం పాదయాత్ర ఉండగా అందుకు సంబంధించి సన్నాహక కమిటీ సమావేశం శనివారం హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగింది.
వరంగల్ పశ్చి మ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రి సీతక్క, ఎంపీలు బలరాంనాయక్, కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సార య్య, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, మామిడాల యశస్వినీరెడ్డి పాల్గొన్నారు. మరో మంత్రి కొండా సురేఖ, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ సమావేశానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల పంచాయతీ కొనసాగుతూనే ఉన్న ది. పీసీసీ జోక్యంతో ఇటీవల అంతా సద్దుమణిగిందని ప్రకటనలు చేసినా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు అలాగే ఉంటున్నాయి. మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలిపై పదేపదే ఫిర్యాదు చేసినా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పట్టించుకోకపోవడంపై ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు.
ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బంది కలిగేలా మంత్రి కొండా సురేఖ వ్యవహరించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారి కార్యక్రమాలకు దూరంగా ఉండి నిరసన తెలపాలని ఎమ్మెల్యేలు నిర్ణయించినట్లుగా తెలిసింది. ఇందులో భాగంగానే పాదయాత్ర ఏర్పాట్లకు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారనే చర్చ జరుగుతున్నది. తనపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే నాయిని ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే సురేఖ హాజరుకాలేదని తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు, గ్రూపుల పంచాయతీ మొదటి నుంచి ఉన్నదని, ఇప్పుడు మరింత తీవ్రమైందని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే గ్రూపులు మొదలు కాగా, ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా ఉండడం, మంత్రుల మధ్య పొసగని పరిస్థితి నెలకొన్నది. మంత్రులు కొండా సురేఖ, సీతక్క మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరగా వారిద్దరు కలిసి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని పరిస్థితి వచ్చింది. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని రెండురోజుల క్రితం ఇద్దరు ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ కీలక సమావేశానికి సీతక్క మాత్రమే రాగా, సురేఖ హాజరు కాలేదు. ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్యపోరు తాజా సమావేశంతో మరోసారి బహిర్గతమైందనే చర్చ జరుగుతున్నది.