నర్సంపేట, ఆగస్టు 21: కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నట్లు గొప్పగా ప్రచారం చేసుకున్నా, ఆచరణలో అమలు కావడం లేదు. ఇందుకు ఉదాహరణగా వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నిలుస్తుంది. ఈ సొసైటీ పరిధిలో ఖాదర్‌పేట, లింగగిరి, అమీనాబాద్తో పలు గిరిజన తండాలుంటాయి.
సొసైటీలోని 1404 మంది రైతులను అర్హులుగా గుర్తించి రూ. 9.46 కోట్ల రుణమాఫీకి జాబితాను సిద్ధం చేశారు. అయితే మూడు విడుతల్లో కలిపి కేవలం 816 మందికి మాత్రమే మాఫీ వర్తించగా, మిగిలిన 588 మందికి రుణమాఫీ కాలేదు. మొదటి విడుతలో 484 మందికి రూ. 2.20 కోట్లు, రెండో విడుతలో 185 మందికి రూ.1.30 కోట్లు, మూడో విడుతలో 147 మందికి రూ.1.20 కోట్లు మాఫీ వచ్చినట్లు సొసైటీ ప్రకటించింది. దీంతో అధికారుల కొర్రీలతో మాఫీకి దూరమైన 588 మంది రైతులు బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతూ ఆగమాగమవుతున్నారు.
అక్కడ కూడా వారికి కచ్చితమైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కాగా, కొందరు రైతులు అమీనాబాద్తో పాటు చెన్నారావుపేట సొసైటీలోనూ సభ్యులుగా ఉంటూ రుణాలు పొందారు. అయితే ఈ రెండు సొసైటీల్లో కూడా వారికి రుణమాఫీ కాలేదు. దీంతో తమకు షరతులు లేకుండా రుణమాఫీ చేసే వరకు ఆందోళన చేస్తామని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు.
నాకు అమీనాబాద్ సొసైటీలో రూ. లక్ష, చెన్నారావుపేటలో రూ. 1.40 లక్షల లోన్ ఉంది. ఈ రెండింటిలో ఏ ఒక్క సొసైటీలోనూ నాకు రుణమాఫీ జరగలేదు. 2022లో సొసైటీలో అప్పుతీసుకొని ఏటా వడ్డీ డబ్బులు చెల్లిస్తూ వస్తున్నాను. అయితే రుణమాఫీ జాబితాలో నా పేరు రాకపోవడంతో వ్యవసాయాధికారులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాను. అయినా వారి నుంచి సరైన సమాచారం రావడం లేదు. వెంటనే రుణమాఫీ చేయాలని కోరుతున్నా వారు పట్టించుకోవడం లేదు. రుణమాఫీ అయ్యేలా చూడాలని అధికారులను కోరాం. తిరిగి కొత్త రుణం ఇస్తే పంటల సాగుకు ఉపయోగించుకుంటాను.
– బుర్రి మల్లయ్య, రైతు, అమీనాబాద్
నాకు చెన్నారావుపేటలోని ఎస్బీఐలో రూ.1.50 లక్షల అప్పు ఉంది. నా కుటుంబానికి రేషన్‌కార్డు లేకపోవడంతో రుణమాఫీని నిలిపివేశారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఆశగా ఎదురుచూశాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీకి ఎక్కువ డబ్బులు అవుతున్నాయనే కారణంతో ప్రభుత్వం కొర్రీలు పెడుతున్నది. లేనిపోని నిబంధనలు పెట్టి రైతులకు కోత పెడుతున్నది. దీని వల్ల చాలా మంది అర్హులైన రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. ఇప్పటికైనా మిగిలిన రైతుల పరిస్థితిని ప్రభుత్వం ఆలోచించి రుణమాఫీని వర్తింపజేయాలి. అందుకోసం అధికారులు చర్యలు తీసుకోవాలి.
– కుండె కుమార్, రైతు, అమీనాబాద్
కేసముద్రం, ఆగస్టు 21 : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సార్ చెప్పిండని రూ.2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న రుణాన్ని బ్యాంక్‌లో చెల్లించాను. నా పేరుపై రూ. 1,67,650, నా భార్య సులోచన పేరు మీద రూ.75,929, మొత్తం రూ. 2, 43, 579 అప్పు ఉంది. రూ. 2 లక్షల కంటే ఎక్కువగా అప్పు ఉంటే, రూ.2 లక్షలు ప్రభుత్వం ఇస్తుందని, మిగతాది బ్యాంక్‌కు చెల్లించాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపాడు. దీంతో నేను రూ.48 వేలను బ్యాంక్‌లో చెల్లించి మేనేజర్‌ను అడుగగా మాకు ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని చెప్పాడు. వ్యవసాయ అధికారిని అడుగగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదన్నాడు.
– కొల్లూరి శ్రీను, రైతు, కేసముద్రం విలేజ్, మహబూబాబాద్ జిల్లా