అవే నిరసనలు.. నిలదీతలు.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. మూడో రోజైన గురువారం ప్రజలు అధికారులపై తిరగబడ్డారు. అర్హులైన పేదలను కాదని అనర్హులను ఎంపిక చేశారంటూ నిలదీశారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారుల జాబితా చదవగానే ప్రజలు వేదిక వద్దకు చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇండ్లు ఉన్నోళ్లకే మళ్లీ ఇచ్చారని, భూములున్నోళ్లనే ఆత్మీయ భరోసాకు ఎంపిక చేశారంటూ మండిపడ్డారు. పేర్లు చదవడమే తమ పని అని, ఎంపిక బాధ్యత కాదని పలుచోట్ల అధికారులు సమాధానమిచ్చారు.
గోడపై అంటించిన జాబితా చదివేందుకు గ్రామసభలెందుకంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులను ఎంపిక చేయకుండా అనర్హులను గుర్తించాలంటూ తమను అడగడమేంటని మండిపడ్డారు. తాము అన్ని విధాలా అర్హులమైనా తమను ఎందుకు ఎంపిక చేయలేదంటూ పలువురు మహిళలు గ్రామసభల్లోనే కన్నీరు పెట్టుకున్నారు. పలుచోట్ల ప్రజలు గ్రామసభ వేదిక ఎదుట, రోడ్లపై బైఠాయించి తమ నిరసనను తెలిపారు. ఊరూరా నిలదీతలు ఉండడంతో అధికారులు జాబితాలోని పేర్లు చదివి అర్ధాంతరంగా గ్రామసభలు ముగించి వెళ్లిపోయారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు లేదని మనస్తాపంతో గ్రామస్తుడు నాగేశ్వర్రావు అధికారుల సాక్షిగా పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం విషమ పరిస్థితిలో ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. కాగా, పోలీసులు ముందుండి గ్రామసభలను నడిపించారు. అధికారులను ప్రశ్నించే వారిని అడ్డుకొని బయటకు పంపడంతో పాటు వీడియోలు చిత్రీకరించారు. – నమస్తే నెట్వర్క్, జనవరి 23
దండం పెడతా సారూ.. న్యాయం చేయండి
అధికారిని వేడుకున్న వృద్ధుడు
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరకు చెందిన ఈ వృద్ధుడి పేరు సుంకరి ఏసయ్య. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అధికారులు పథకాలకు సంబంధించిన జాబితాలను చదివి వినిపించారు. అందులో అర్హులవి కాకుండా అనర్హుల పేర్లే అధికంగా ఉండడంతో ఆగ్రహానికి గురయ్యాడు. అధికారుల వద్దకు వెళ్లి తనకు ఒక్క పథకం కూడా రాలేదంటూ నిలదీశాడు. ‘సారూ.. మీకు దండం పెడతా.. మాకు న్యాయం చేయండి.. అర్హులైన నిరుపేదలకు పథకాలు అందించండి’ అంటూ చేతులు జోడించి వేడుకున్నాడు. ఈ దృశ్యం అక్కడున్న వారిని కలచివేయగా, ప్రభుత్వం ప్రకటిస్తున్న లబ్ధిదారుల జాబితాల్లోని లోటుపాట్లను ఘటన ఎత్తిచూపింది.
– పెద్దవంగర, జనవరి 23
పేదలకు ఇల్లు ఇవ్వరా?
గ్రామసభలో కన్నీటి పర్యంతమైన మహిళ
పెద్దవంగర, జనవరి 23 : ‘రోజు కూలినాలి చేసుకుంటేనే బతుకుదెరువు. నాకు సొంతిల్లు.. గుంట భూమి లేదు. ప్రజా పాలనలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా జాబితాలో పేరు రాలేదు. ఇందిరమ్మ ఇల్లు పేదలకు ఇవ్వరా? ఇండ్లు ఉన్నోళ్లకే మళ్లీ ఇచ్చుడేంది? నేను ఒంటరి మహిళను’ అంటూ పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన ఎండీ మున్ని గురువారం జరిగిన గ్రామసభలో కన్నీరు పెట్టుకుంది. కాంగ్రెస్ సర్కారు వస్తే కష్టాలు తీరతాయనుకుంటే పేదలకే నష్టం జరుగుతుందని, ఇదెక్కడి న్యాయం? అంటూ ప్రశ్నించింది. తనకు ఇల్లు మంజూరు చేయాలంటూ అధికారులను వేడుకుంది.
అర్హులను ప్రకటించలేని గ్రామ సభలెందుకో..?
నల్లబెల్లి : అర్హులను ప్రకటించని గ్రామ సభలెందుకో మరి. ప్రజాపాలన, కులగణనలో తమకు కావాల్సిన పథకాల గురించి దరఖాస్తు చేశాం. కుటుంబ వివరాలు ఇచ్చాం. అయినా మల్లా కొంతమందిని దరఖాస్తు చేసుకోవాలంటున్నరు. మరి గప్పుడు దరఖాస్తులు చేసుకున్న కాగితాలు ఏమయినయి. చెత్తబుట్టలో ఏశారా. ప్రజాపాలన, కులగణన పేరుతో ప్రభుత్వం కోట్లు ఖర్చు చేత్తాంది. గా పైసలతోనే బీదోళ్లకు ఇండ్లు ఇవ్వొచ్చు కదా. మేమైతే అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా పాఠశాలల అభివృద్దికి పనులు చేశాం. 9 నెలలైతాంది గీ కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లి గవ్వ ఇయ్యకపాయే. అప్పిచ్చినోడు లొల్లిపెట్టబట్టే. దీంతో ఇంటోడితో నిత్యం ఇబ్బందుల పడుతుంటిమి. ఇగనైనా సర్కారు నిరుపేదలకు పథకాలు ఇయ్యాలే. మహిళలకు బాకీ ఉన్న డబ్బులు విడుదల చేయాలే. లేదంటే అమ్మలక్కల ఉసురు ఊరికనే పోదు.
– కనకం అనూష, నల్లబెల్లి, వరంగల్
ఇల్లు లేక కిరాయికి ఉంటున్న
దేవరుప్పుల : నాకు ఇల్లు లేక రెండేళ్ల నుంచి ఊర్లనే కిరాయికి ఉంటున్న. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసిన. గ్రామ సభల నా పేరు రాలే. ఇంత అన్యాయమా? ఇల్లు కోసం ఎదురు చూస్తున్న నా పేరు లిస్టుల లేదంటే ఇదేం రాజకీయం. ఊర్ల లేనోళ్లు, ఇల్లున్నోళ్ల పేర్లు చదివిండ్రు. ఇది అధికారుల తప్పిదమా? లేక ఇందిరమ్మ కమిటీ సభ్యులు నా పేరు తీసేసిండ్రా? చెప్పాలె. జాగా ఉంటె ఇల్లిస్తమని ప్రచారం చేసిండ్రు. నాకు జాగా ఉండి ఇల్లు లేదు. ప్రభుత్వ పథకం కోసం ఆశ పడితే అడియాశైంది.
– బూరుగు అశోక్, గొల్లపల్లి, దేవరుప్పుల