ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-4 పోస్టుల నోటిఫికేషన్ రానే వచ్చింది. ఎన్నో ఆశలతో సన్నద్ధమవుతున్న యువతీయువకుల్లో ఇప్పుడు నయా జోష్ నిండింది. వివిధ శాఖల్లో 9,168 ఉద్యోగాలు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగార్థుల్లో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. ఈ నెల 23 నుంచి జనవరి 12వరకు దరఖాస్తుల సమర్పణ జాతర కొనసాగనుండగా, ఎప్పటినుంచో జిల్లా గ్రంథాలయాలు నిరుద్యోగులతో బిజీగా మారాయి. ఇంత పెద్ద సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి యువలోకం కృతజ్ఞతలు తెలుపుతున్నది.
– హనుమకొండ,డిసెంబర్ 1
ఉద్యోగార్థుల్లోఆత్మైస్థెర్యం
భూపాలపల్లి రూరల్, డిసెంబర్1: రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉద్యోగార్థుల్లో అత్మైస్థెర్యం నింపుతోంది. గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షణీయం. సీఎం కేసీఆర్ భారీగా పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకుంటున్నారు. డిగ్రీ పూర్తి చేసి, ఇప్పటికే కోచింగ్ తీసుకొని గ్రూప్-4 కోసం ఎదురుచూస్తున్న. మాలాంటి వాళ్లం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. ఈ పోస్టులు 9,168 ఉన్నందున తప్పకుండా ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది.
– గొల్లేపెల్లి విజయలక్ష్మి, భూపాలపల్లి
గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలపై ఉద్యోగార్థుల్లో సంబురం
గ్రూప్ -4 పోస్టుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. భారీ స్థాయిలో గ్రూప్-4 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. వివిధ శాఖల్లో మొత్తం 9,168 పోస్టులు భర్తీ చేయనుంది. ఇందుకోసం ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఏప్రిల్‌లో గాని, మేలో గాని టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఖాళీల వివరాలు, వయస్సు, వేతనం, అర్హత తదితర వివరాలకు వెబ్సైట్ https://www.tspsc.gov.inలో సంప్రదించాలి. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు కోచింగ్ తీసుకుంటుండగా, కొందరు సొంతంగా ప్రిపేర్ అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా గ్రూప్ -4 ఉద్యోగాలను భర్తీ చేస్తుండడంతో ఉద్యోగార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా ఉద్యోగం సాధిస్తామనే నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు. పెద్ద సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
– హనుమకొండ, డిసెంబర్ 1
ప్రణాళికతో చదివితే ఉద్యోగం మనదే
మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 1: పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. గ్రూప్-4 ద్వారా 9168 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి సువర్ణ అవకాశం. గతంలో ఎప్పుడు కూడా ఇంత మొత్తంలో పోస్టులు వేయలేదు. ప్రణాళికతో చదివిన వారందరికి జాబ్ వస్తది.
– బానోత్ అశోక్, సికింద్రాబాద్ తండా
సమయాన్ని వృథా చేయొద్దు
గ్రూప్-4 కోసం నేను రెండు నెలలుగా ప్రిపరేషన్ అవుతున్నా. ఈ నోటిఫికేషన్ విడుదల కావడం ఎంతో సంతోషంగా ఉంది. బంగారు తెలంగాణకు గ్రూప్-4 నోటిఫికేషన్ మార్గదర్శకం. 9 వేల ఉద్యోగాల్లో నేను ఉద్యోగాన్ని సాధిస్తానన్న గట్టి నమ్మకం ఉంది. సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకుంటా.
– సమీర్, హనుమకొండ
వరుస నోటిఫికేషన్లు
పాలకుర్తి రూరల్, డిసెంబర్1: నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ లో సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తున్నారు. వీఆర్ఓలు, ఏఈఓలతో పాటు గ్రూఫు 1, గ్రూప్ 2 వంటి నోటిఫికేషన్లు ఇచ్చారు. ప్రస్తుతం గ్రూఫు-4 నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగులకు వరం. 9,168 పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభినందనీయం.
– కమ్మగాని శ్రావణ్
ఇదే మొదటిసారి
హనుమకొండ, డిసెంబర్1: రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్-4 నోటిఫికేషన్ ఇంత పెద్దఎత్తున పడడం ఇదే మొదటిసారి. దీంతో నిరుద్యోగుల్లో పోటీతత్వం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారు. త్వరగా పరీక్షలు నిర్వహించాలి.
– నిఖిత
కొలువుల జాతర
ఏటూరునాగారం, డిసెంబర్ 1: రాష్ట్రప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగానే గ్రూపు-4 నోటిఫికేషన్ విడుదల చేసింది. వేల పోస్టుల భర్తీ ఎంతో మంది నిరుద్యోగులకు వరం. ఇది కొలువుల జాతరగా ఉంది. నేను మాస్టర్ డిగ్రీ పూర్తి చేశా. ఉద్యోగం సాధించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తా. నిరుద్యోగుల తరపున కేసీఆర్‌కు కృతజ్ఞతలు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా లోకల్ వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ప్రతి నిరుద్యోగి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– పర్వతాల రాజ్‌కుమార్, ఏటూరునాగారం
పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ
జనగామ రూరల్, డిసెంబర్1: రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇప్పుడు గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. గ్రామీణ ప్రాంతాల వారికి మంచి అవకాశం. ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో పట్టుదలతో చదువాలి. కష్టపడితేనే జాబ్ వస్తుంది. అందుకు గట్టి కృషి చేయాలి.
– చినబోయిన రేఖ, పెంబర్తి
జాబ్ సాధించడమే లక్ష్యం
మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 1: జాబ్ సాధించడమే లక్ష్యం. ఉద్యోగం కోసం రెండేళ్లుగా చదువుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-4 నోటిఫికేషన్ జారీ చేయడం శుభ పరిణామం. ఒకేసారి భారీ సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తోంది. కష్టపడి చదివిన వారికి ఈ సారి తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది. భారీ సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది.
-సోమ ప్రవీణ్, మహబూబాబాద్
రుణపడి ఉంటాం
కృష్ణకాలనీ, డిసెంబర్1: గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు నిరుద్యోగులమంతా రుణపడి ఉంటాం. ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు వేసిన చరిత్ర ఏ ప్రభుత్వానికి లేదు. ఈ నోటిఫికేషన్‌తో చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను గతేడాది నుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేరవు తున్నా. కష్టపడి చదవి ఈసారి ఉద్యోగం సాధిస్తా.
– వట్టెపల్లి వెంకటేశ్, కాశీంపల్లి, భూపాలపల్లి
అభినందనీయం 
ములుగురూరల్, డిసెంబర్1: నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-4 ఉద్యోగాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం అభినందనీయం. కొంతకాలంగా ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ప్రక్రియను చేపట్టడంతో అభ్యర్థుల్లో ఉద్యోగాలు దక్కించుకోవాలనే పోటీతత్వం పెరిగింది. ప్రస్తుతం విడుదల చేసిన గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి సుమారు 9వేల పోస్టులను భర్తీ చేస్తుండడంతో నిరుద్యోగులకు మంచి అవకాశం దొరికింది.
– రాస కుమార్, అబ్బాపురం, ములుగు
మాట నిలుపుకొన్న కేసీఆర్
నర్సింహులపేట, డిసెంబర్1: సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తానని గ్రూప్-4లో 9168 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇందులో ఉద్యోగం వచ్చేందుకు కష్టపడి చదువుతా.
– జాటోతు గోపీసింగ్, దుబ్బతండా
నిరుద్యోగులకు భరోసా
నర్సింహులపేట, డిసెంబర్1: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు భరోసానిచ్చారు. ప్రభుత్వం టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 విడుదల చేయడం సంతోషదాయకం. నేను ఎంకాం చదివి, గ్రూప్ 2, 4 కోసం కొన్ని రోజులుగా కోచింగ్ తీసుకుంటున్నా. ప్రస్తుతం ఇంటి వద్దే చదువుకుంటున్న.
– అల్వాల యాకన్న, పడమటిగూడెం
సంతోషంగా ఉంది
కేసముద్రం, డిసెంబర్1: ప్రభుత్వం గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ చేసి సర్కారు కొలువు కోసం ప్రిపేర్ అవుతున్నా. గ్రూప్- 4లో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలి.
– జాటోత్ కిషన్, కేసముద్రం
మంచి అవకాశం
నర్సంపేట రూరల్, డిసెంబర్1: నేను పీజీ చదువుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షించదగిన విషయం. నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పించింది. సరైన సమ యంలో నోటిఫికేషన్ జారీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ పోస్టుల భర్తీతో నిరుద్యోగుల్లో ఆశలు చాలా వరకు పెరిగాయి. పరీక్షలకు కూడా ప్రభుత్వం చాలా సమయం ఇచ్చింది. ముఖ్యంగా గ్రూప్-4లో 3కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉండడం బాగుంది. – బూస శ్రావణి, రాజపల్లి, నర్సంపేట
పట్టుదలతో చదువుతా..
బచ్చన్నపేట, డిసెంబర్1 : రాష్ట్ర ప్రభుత్వం గ్రూపు-4 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభ పరిణామం. పట్టుదలతో చదువుతా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలకు కల్పించడంలో సర్కారు చేస్తున్న కృషి భేష్. నేను డిగ్రీ చదివా. దరఖాస్తు చేయగానే ప్రిప రేషన్ ప్రారంభిస్తా. కచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొడుతా.
– గౌరారం శ్రీనివాస్, బండనాగారం, బచ్చన్నపేట
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
గ్రూప్-4లో 9168 ఖాళీలను పూర్తి చేయడానికి రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షణీయం. డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉద్యోగం సాధించడం చాలా సులువు. నిష్ణాతులైన అధ్యాపక గైడెన్స్ చాలా అవసరం. ప్రతి రోజూ ‘నమస్తే తెలంగాణ’లో వచ్చే కాలమ్స్ ఎంతో ఉపయోగపడతాయి. ఇంత పెద్ద నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
– ఐలి చంద్రమోహన్‌గౌడ్, గ్రూప్స్ కోచింగ్ అడ్వైజర్, రామప్ప అకాడమీ చైర్మన్
జాబ్ కొడుతా..
దేవరుప్పుల, డిసెంబర్ 1: గ్రూప్-4 జాబ్ కొడుతా. పోస్టులు ఎక్కువగా ఉండడంతో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కష్టపడి ఇంట్లోనే కాంపిటీషన్ పుస్తకాలు చదువుతా. మైక్రోబయాలజీలో బీఎస్సీ డిగ్రీ ఇటీవలే పూర్తి చేశా. ప్రభుత్వం అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. స్నేహితులతో కలిసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతా.
– జోగు అఖిల, దేవరుప్పుల