కేసముద్రం, డిసెంబర్ 13:మక్కజొన్నకు కత్తెర పురుగు ఆశించి రైతన్నను ఆందోళనకు గురిచేస్తోంది. వేసవిలో 30 రోజులు.. చలికాలంలో మూడు నెలల పాటు బతికుంటుంది. ఒక్కో ఆడ పురుగు రెండు వేల గుడ్లు పెడుతూ తన సంతతిని వేగంగా విస్తరింపజేస్తుంది. దీని వల్ల పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే పురుగును అరికట్టవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఖరీఫ్‌లో పెసర, పత్తి, వేరుశనగ వంటి పంటలు చేతికి రాగా రైతులు మళ్లీ దుక్కులు దున్ని యాసంగిలో మక్కజొన్న సాగుచేస్తున్నారు. అయితే ఇదే సమయంలో మక్కజొన్నకు పురుగు ఆశించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటి నివారణ కోసం సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. గతేడాది యాసంగిలో 32వేల ఎకరాల్లో మక్కజొన్న సాగు కాగా ఈ ఏడాది అదనంగా మరో 12వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేయగా ఇప్పటికే 20వేల ఎకరాల్లో పంట సాగైనట్లు తెలుస్తోంది. ఈమేరకు సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ఇప్పటికే అందుబాటులో ఉంచారు.
పంటకు నష్టం కలిగిస్తున్న కొత్త పురుగు స్పోడోప్టెరా
మక్కజొన్నలో లద్దెపురుగు జాతికి చెందిన కొత్త పురుగు స్పోడోప్టెరా పంటకు నష్టాన్ని కలిగిస్తోంది. ఈ పురుగు వేసవిలో 30 రోజులు, వసంత కాలంలో 60 రోజులు, చలికాలంలో 90 రోజులు బతికి ఉంటుంది. ఒక్కో ఆడ పురుగు దాదాపు 1500 నుంచి 2వేల గుడ్లు పెడుతుంది. ఈ పురుగు 100 నుంచి 200 గుడ్లను సముదాయంగా అడుగు ఆకులతో కాండంపై పెడుతుంది. పొదిగిన గుడ్లు రెండు, మూడు రోజుల్లో పగిలి తొలి దశ లార్వాలు అదే ఆకును తొలిచి తింటుంది. ఆ తర్వాత మక్కజొన్న సుడిలోకి ప్రవేశిస్తుంది. తొలి దశలో లార్వా ఆకుపచ్చగా ఉండి నల్లని తలతో ఉంటుంది. లార్వా దశ ఆరు దశల్లో పూర్తి చేసుకుంటుంది. ఎదిగిన లార్వా ముదురు గోధుమ వర్ణంలో దాదాపు 34 మి.మీ ఉంటుంది. గోధుమ, బూడిదరంగు మిళితమైన వర్ణంలో ఉండి తెల్లటి రెక్కలను కలిగి ఉంటాయి. రెక్కల పురుగు 7 నుంచి 21 రోజులు బతుకుతుంది. వీటిని అరికట్టేందుకు వ్యవసాయాధికారులు పలు సూచనలు, సస్యరక్షణ చర్యలు చెబుతున్నారు. అవి పాటిస్తే పంటను పురుగుల బారి నుంచి కాపాడుకోవచ్చు.
సమగ్ర సస్యరక్షణ చర్యలు :
పంట విత్తిన వెంటనే ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించాలి.
చేనులో నలుమూలలా తిరిగి పురుగు ఆశించిన మొక్కలున్నాయో పరిశీలించాలి.
సామూహిక సస్యరక్షణ చర్యలు చేపట్టేలా రైతులను చైతన్యపర్చాలి.
నివారణ పద్ధతులు ఇవీ..
కత్తెర పురుగు తన ప్యూపా దశను నెలలో పూర్తి చేసుకుంటుంది. పొలంలో విత్తే ముందు లోతైన దుక్కి చేయడం వల్ల ప్యూపాలు పక్షుల బారినపడి పంటపై పురుగు ఉధృతి తగ్గుతుంది.
కాలానుగుణంగా మక్కజొన్న సాగు చేయాలి. విడుతలుగా వేయకూడదు. ఆలస్యంగా సాగుచేసిన పంటను పురుగు ఎక్కువగా ఆశిస్తుంది.
గుర్తింపు ఉన్న హైబ్రిడ్ రకాలను సాగు చేయాలి.
అంతర పంటలో మక్కజొన్న సాగు చేస్తే పురుగు తక్కువగా ఆశిస్తుంది.
అవగాహన కల్పించాం..
మక్కజొన్నకు ఆశించే కత్తెర పురుగును ఎలా నివారించాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పంట వేసిన తర్వాత నెల రోజుల లోపు ఐదు గ్రాముల మెటారైజియం ఎన్తెసోప్లియోను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసి లార్వా దశను నివారించవచ్చు. ఇన్ఆక్సీకార్బో, ల్యాండాసైలిత్రిన్, స్పైయినోసైడ్, మిథాక్సీస్పైనోజెడ్ వంటి వాటిని పిచికారీ చేయవచ్చు. కత్తెర పురుగు ఉన్నట్లయితే ఒక్క గ్రాము లార్విన్ను ఒక లీటర్ నీటిలో నీమ్ ఆయిల్ కలిపి పిచికారీ చేస్తే పురుగు నశిస్తుంది.