హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 24: ములుగు రోడ్డులోని ఐటీఐ ప్రాంగణంలో నిర్మిస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి సదుపాయాలను సిద్ధం చేసి ఉంచాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ములుగు రోడ్డులోని ఐటీఐ ప్రాంగణంలో పురోగతిలో ఉన్న ఏటీసీ భవనం నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. అదేవిధంగా ఏటీసీకి వెళ్లేందుకు ఉన్న అంతర్గత రహదారిని పరిశీలించారు.
భవన నిర్మాణ పనుల పురోగతి, అప్రోచ్‌రోడ్డు నిర్మాణం గురించి అధికారులను, నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారుతో కలెక్టర్ మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఏటీసీకి సంబంధించిన అన్ని పనులు త్వరగా పూర్తిచేయాలని, అప్రోచ్ రోడ్డును వారం రోజుల్లో పూర్తిచేయాలని గుత్తేదారును ఆదేశించారు. ఏటీసీ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ బాలుర ఐటిఐ ప్రిన్సిపల్ ఎం.చందర్, హనుమకొండ ఐటీఐ ప్రిన్సిపల్ జి.సక్రు, సిబ్బంది పాల్గొన్నారు.