కాశీబుగ్గ/హనుమకొండ, మే 12 : నేడు జరుగనున్న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఎనుమాముల మార్కెట్ పరిధిలో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను ఆదివారం ఆమె ఎన్నికల సాధారణ పరిశీలకుడు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వరంగల్ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్లో 230 పోలింగ్ కేంద్రాలకు 21 రూట్లు, వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లో 279 పోలింగ్ కేంద్రాలకు 37 రూట్లలో బస్సు రూట్‌మ్యాప్ ఆధారంగా పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని ఎన్నికల సామగ్రితో తరలించినట్లు తెలిపారు. సెక్టోరియల్ అధికారుల సమక్షంలో కేటాయించిన రూట్లలో ప్రతి బస్సుకు పోలీసులు ఎస్కార్ట్‌గా వెళ్లినట్లు చెప్పారు.
ఎనుమాముల మార్కెట్లో వరంగల్‌తూర్పు, వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఈవీఎంలు, వీవీప్యాట్ల పంపిణీ ఏర్పాట్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఏఆర్వోలు, అశ్వినీ తానాజీ వాకడ్, సిదం దత్తు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్లు ఇక్బాల్, నాగేశ్వర్రావు, విజయ్‌సాగర్ పాల్గొన్నారు. అలాగే, వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మారెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గానికి చెందిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను హనుమకొండ కలెక్టర్ సిక్తాపట్నాయక్ పరిశీలించారు.
ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామగ్రి పంపిణీ కోసం చేసిన ఏర్పాట్లను ఆమె పరిశీలించి అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఏఆర్వోలు నారాయణ, వెంకటేశ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నట్లు తెలిపారు. ఏఆర్వో నారాయణ, ఏసీపీ కిశోర్ కుమార్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. కాగా, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 244 పోలింగ్ కేంద్రాలుండగా 2,83,446 మంది ఓటర్లు, పరకాల నియోజకవర్గంలో 239 పోలింగ్ కేంద్రాలుండగా 2,22,383 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.
నర్సంపేట : నర్సంపేట నుంచి పోలింగ్ అధికారులను సామగ్రితో పటిష్ట భద్రత నడుమ పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఆదివారం ఉదయం నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఉన్న కేంద్రంలో రిపోర్టు చేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా సిబ్బందికి సామగ్రిని అందించారు. మధ్యాహ్నం రూట్ల వారీగా కేటాయించిన బస్సుల్లో ఆయా కేంద్రాలకు సిబ్బంది తరలివెళ్లారు. నర్సంపేట నియోజకవర్గంలో 2,35,849 మంది ఓటర్లకు 283 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1350 మంది పోలింగ్ అధికారులు, 23 మంది మైక్రో ఆబ్జర్వర్లను నియమించారు. నర్సంపేట ఆర్డీవో కృష్ణవేణి, తహసీల్దార్ విశ్వప్రసాద్ ఏర్పాట్లు చేశారు.