రాయపర్తి : పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి రాక కోసం సుమారు రెండున్నర గంటల పాటు జిల్లా కలెక్టర్ డా.సత్య శారద సహా జిల్లా అధికార యంత్రాంగం అంతా ఎదురుచూసిన సంఘటన రాయపర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం-రాయపర్తి నేతృత్వంలో ఏర్పాటు చేసిన యాసింగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జిల్లా అధికారులతో కలిసి రైతువేదిక ఆవరణలో ప్రారంభిస్తారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది.
సరిగ్గా 10:30 గంటలకు జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీర్డీవో కౌసల్యాదేవితోపాటు జిల్లా సహకార శాఖ, పౌరసరఫరాల శాఖ, పేదరిక నిర్మూలన గ్రామీణ అభివృద్ధి శాఖల జిల్లా స్థాయి అధికార యంత్రాంగమంతా మండల స్థాయి అధికారుల బృందంతో కలసి రైతు వేదిక భవనానికి చేరుకున్నారు. కానీ ఎమ్మెల్యే సకాలంలో కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో గంటల తరబడి ఎదురు చూస్తూ సెల్ ఫోన్ లతో కాలాక్షపం చేయాల్సి వచ్చింది.
సాక్షాత్తు జిల్లా కలెక్టర్ సహ జిల్లా, మండల స్థాయి అధికార యంత్రాంగం ఎమ్మెల్యే రాక కోసం నిరీక్షించడాన్ని చూసి అధికార పార్టీ నేతలతో పాటు రైతులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాయపర్తి మండలంలోని రాయపర్తి, బూరహాన్ పల్లి, కొలను పల్లిలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సి ఉండగా అధికారులంతా అసహనంతో ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొందని గుసగుసలు వినిపిస్తున్నాయి.