వరంగల్ చౌరస్తా: వరంగల్ సీకేఎం హాస్పిటల్‌ను వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సందర్శించారు. సోమవారం హాస్పిటల్ నిర్వహిస్తున్న పలు పనులను ఆమె పరిశీలించారు. ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ నిర్మాణ పనులను, శానిటేషన్ నిర్వహణ పనులను త్వరగా పూర్తి చేయాలని వైద్యాధికారులు ఆదేశించారు. అనంతరం ఆపరేషన్ థియేటరు, ఐసీయూ విభాగాలను పరిశీలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహిళలకు అందిస్తున్న డైట్ తీరుపై కలెక్టర్ సత్య శారద తీవ్రంగా మండిపడ్డారు. అసలు డైటీషియన్, వైద్యుల సూచనలు లేకుండా ఇష్టారీతిన భోజనం అందించడం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
డైట్ నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారం తో సాయంత్రం కలెక్టరేట్ కి రావాలని అధికారులను ఆదేశించారు. నవజాత శిశువుల వార్డు ను పరిశీలించి పిల్లల సంఖ్య, అందుతున్న సేవల వివరాల రికార్డు లను పరిశీలించారు. పారామెడికల్ టెస్టుల కోసం ప్రైవేట్ సెంటర్స్ ను ఆశ్రయించకుండా, వెంటనే పారా మెడికల్ టెస్టులు కొనసాగేలా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా స్వశక్తి క్యాంటీన్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో సీకేఎం హాస్పిటల్ ఆర్. ఎం. ఓ డా. మురళి, వైద్యాధికారులు, వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.