వర్ధన్నపేట, నవంబర్ 20: ధాన్యం తూకంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని కలెక్టర్ సత్య శారద నిర్వాహకులకు సూచించారు. ఇల్లంద వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తూకం వేయడంలో జాప్యం చేస్తున్నారని పలువురు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి ధాన్యాన్ని తప్పకుండా ప్యాడీ క్లీనర్లో శుభ్రం చేసిన వెంటనే తూకం వేయించాలని సూచించారు.
అంతేకాకుండా నిబంధనల మేరకే బస్తాలను తూకం వేయాలే తప్ప ఎక్కువ వేసి రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. అలాగే, సన్న రకం ధాన్యానికి రూ. 2320 మద్దతు ధరతోపాటు రూ. 500 బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులు విధిగా ధాన్యాన్ని తాలు, రాళ్లు, వ్యర్థాలు లేకుండా ప్యాడీ క్లీనర్లతో శుభ్రం చేయాలని సూచించారు. కేంద్రాల వద్ద వసతులు కల్పించాలని ఆదేశించారు. తూకం వేసిన బస్తాలను వెంటనే కేటాయించిన మిల్లులకు తరలించాలన్నారు. హమాలీలు కూడా రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. కలెక్టర్ వెంట మార్కెటింగ్ అధికారి సురేఖ, డీఏవో అనురాధ, సివిల్ సప్లయ్ మేనేజర్ సంధ్యారాణి, డీసీవో నీరజ ఉన్నారు.
రాయపర్తి: మండలంలో నిర్వహిస్తున్న సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో పత్తి కాంటాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. బుధవారం రాత్రి ఆమె మండలంలోని మొరిపిరాల, మైలారం పరిధిలోని హరిచందన, శ్రీభాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్ల్లో నిర్వహిస్తున్న పత్తి కొనుగోళ్లను ఆమె తనిఖీ చేశారు. నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పత్తికి మద్దతు ధర అందించేలా నిర్వాహకులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె పత్తి నాణ్యతను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి సురేఖ, డీఏవో అనురాధ, సివిల్ సప్లయ్ మేనేజర్ సంధ్యారాణి, డీసీవో నీరజ పాల్గొన్నారు.
ఖిలావరంగల్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు అందించేందుకు మండల ప్రత్యేక అధికారులు అంకితభావంతో పని చేయాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్లో ఆమె ధాన్యం, పత్తి కొనుగోళ్లు, కుటుంబ సర్వే పురోగతిపై మండల ప్రత్యేక అధికారులతో సమీక్షించారు. మండల ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన మండలాల్లోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు నిర్దేశిత గడువులోగా సజావుగా జరిగేలా నిత్యం పర్యవేక్షించాలన్నారు. జిల్లావ్యాప్తంగా 70 శాతం సర్వే పూర్తి చేసినట్లు చెప్పారు. సమీక్షలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జడ్పీ సీఈవో రాంరెడ్డి, సీపవో గోవిందరాజన్ పాల్గొన్నారు.