తాడ్వాయి, జనవరి 3 : మేడారం అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమ్మక్క-సారలమ్మల మహాజాతర ఏర్పాట్లపై పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, దేవాదాయ శాఖ అధికారులతో ఐటీడీఏ పీవో అంకిత్, అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి ఆమె మేడారంలోని ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లో బుధవారం సమీక్ష నిర్వహించారు. పార్కింగ్, తాగునీరు, పారిశుధ్యం, క్యూ లైన్లు తదితర ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఆలయ ప్రాంతంలో చేపట్టిన ఎండోమెంట్ పనులను పరిశీలించారు.
మేడారం వద్ద ఆర్డబ్ల్యూఎస్ డార్మిటరీ భవనం వెనుక పూజారులకు గెస్ట్‌హౌస్ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. అ లాగే వీవీఐపీ పార్కింగ్, కల్వర్టు నిర్మాణం, వెంగళాపూర్, చింతల్ వద్ద పార్కింగ్ స్థలం చదును, కొత్తూరు, ఊరట్టం వైపు జంపన్నవాగులో ఓపెన్ వెల్ పూడికతీత తదితర పనులను పరిశీలించారు. పీఆర్, ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్, పీవో వెంట ఈవో రాజేందర్, పీఆర్ ఈఈ అజయ్‌కుమార్, డీపీవో వెంకయ్య, విద్యుత్ శాఖ డీఈ నాగేశ్వర్రావు, ఏపీవో వసంతరావు తదితరులు ఉన్నారు.