చలి పంజా విసురుతున్నది. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు 13.8 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోతుండడంతో తెల్లవారుజాము నుంచే మంచు కమ్మేస్తూ మస్తు ఇగం పెడుతున్నది. దీంతో అంబటాళ్ల దాటినా జనం ఇంట్లో నుంచి బయటకు రాక రహదారులు, వీధులు బోసిపోతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చల్లని గాలులు వీయడమే గాక భానుడి జాడ లేక పగలు కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంటున్నది.
దీం తో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. చలి పెరగడంతో స్వెట్టర్లు, జర్కి న్స్, మఫ్లర్లు లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి ఉన్నది. ఇటు వ్యవసాయంపైనా చలి ప్రభావం పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మున్ముం దు ఉష్ణోగ్రతలు మరింత ఇంకా తగ్గుతాయనే వాతావారణ శాఖ ప్రకటన నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
– హనుమకొండ/హనుమకొండ సబర్బన్, నవంబర్ 23
తెల్లవారుజాము నుంచే మంచు కమ్మేస్తున్నది. రోజురోజు ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలర్జీ, బీసీ, గుండె, అస్తమా, శ్వాసకోస సంబంధ వ్యాధులున్నవారు మరింత శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, ఊపిరితుత్తుల సమస్య, తుమ్ములు వస్తాయని, చిన్నారుల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడి నిమోనియా బారిన పడే అవకాశలుంటాయి. గాలి ద్వారా సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించడంతో రోగ నిరోధక శక్తి తగ్గుతుందని, వీటన్నింటిని తట్టుకొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకొంటేనే వ్యాధుల బారిన పడకుండా ఉంటామని డాక్టర్లు చెబుతున్నారు.
వ్యవసాయానికి ప్రతికూలం
ఒక్కసారిగా పెరిగిన చలితో వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపనున్నది. ప్రస్తుతం చాలాచోట్ల వరి కోతలు పూర్తయి, నార్లు పోసుకుంటున్నారు. అయితే ఈ చలి వల్ల నార్లు మొలకెత్తే పరిస్థితి లేదు. మొలక శాతం తక్కువగా వస్తుందని రైతులు చెబుతున్నారు. ఇతర పంటలు కూడా ఏపుగా రావని అంటున్నారు. పశువులు వ్యాధుల బారిన పడే అవకాశలుంటాయని వైద్యులు చెబుతున్నారు.