హనుమకొండ చౌరస్తా, నవంబర్ 18 : ప్రజాపాలన విజయోత్సవ సభ కోసం ప్రభుత్వ అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ జన సమీకరణ చేయిస్తున్నది. కాంగ్రెస్ సర్కారు విజయోత్సవాల్లో భాగంగా ఇందిర మహిళా శక్తి పేరిట నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో మంగళవారం బహిరంగ సభ నిర్వహిస్తున్నది. అయితే మహిళలను సమీకరించే బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల(డీఆర్డీవో)కు బాధ్యతలను అప్పగించింది.
ఎంపీడీవోలు, వీవోలు, ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లోని ప్రతి మహిళను వరంగల్ మీటింగ్‌కు రావాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నారు. వరంగల్ బహిరంగ సభ జన సమీకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 900 ఆర్టీసీ బస్సులను వాడుకుంటున్నది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే 150 బస్సులను కేటాయించింది. దీనికి తోడు ఇతర వాహనాల్లో సాధారణ జనాన్ని తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా జరుగుతున్న వరంగల్ బహిరంగ సభ కోసం అధికార ఒత్తిడి తేవడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు హనుమకొండ జిల్లా పర్యటనకు రానున్నారు.