వరంగల్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈసారి మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు తల్లుల గద్దెల ప్రాంగణం కొత్త హంగులతో రూపుదిద్దుకోనున్నది. ఆ హంగులన్నీ వంద రోజుల్లో పూర్తి చేస్తామని సర్కార్ వెల్లడించింది. సమక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు వరుసగా నిలవనున్నాయి. మాస్టర్‌ప్లాన్ పేరుతో రేవంత్సర్కార్ మేడారం తల్లుల గద్దెల కైవారం, ప్రాంగణాన్ని ఆధునీకరించబోతున్నది.
ఈ మేరకు మంగళవారం మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించి, వచ్చే జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర నేపథ్యంగా చేపట్టనున్న అభివృద్ధి పనులపై పూజారులు, ఆయా భాగస్వామ్య శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. పూజారుల ఇష్టానుసారమే తమ సర్కారు నడుచుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. రేవంత్ ప్రభుత్వం చేపట్టబోయే పనులతో తన జన్మధన్యమైందని మంత్రి సీతక్క భావోద్వేగంతో ప్రకటించారు.
పూజారులు, ఆదివాసీ ప్రతినిధులతో సమీక్ష
మేడారంలో తల్లుల దర్శనం, గద్దెల ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క పూజారులు, ఆదివాసీ ప్రతినిధులతో సమీక్షించారు. అనంతరం సభలోనూ ఆయన మాట్లాడుతూ పదే పదే ‘నిర్మాణ బాధ్యతే ప్రభుత్వానిది.. సంప్రదాయాల పరిరక్షణ అంతా మీదే’ అని పేర్కొన్నారు.
రాబోయే పరిణామాలను, ఆదివాసీ సమాజం నుంచి భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే అంశాలను పరిగణనలోకి తీసుకొనే సీఎం అలా వ్యాఖ్యానించి ఉంటారనే అభిప్రాయాలు మేడారం ప్రాంగణం, సభా ప్రాంగణంలో వ్యక్తం కావడం గమనార్హం. మొత్తానికి మేడారం మహాజాతర నేపథ్యంగా ఈసారి భక్తులకు తల్లుల ప్రాంగణం కొత్త రూపుతో దర్శనమివ్వబోతున్నదనే స్పష్టమైన సంకేతాలను రేవంత్ ప్రభుత్వం ఇచ్చింది.
ఇటీవలి డిజైన్లకు తిలోదకాలు
మహాజాతర నాటికి మేడారం గద్దెల కైవారం, ప్రాంగణంలో సర్కార్ తలపెట్టిన కొత్త హంగులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. గత జూలై 3వ తేదీ నుంచి మేడారం కేంద్రంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఆదివాసీ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు వెల్లడించిన అభిప్రాయాల సమాహారంగా ‘మేడారంలో అపచారం, మేడారంలో మరో అపచారం, మేడారంలో సాంచీ స్తూపం ఆనవాళ్లా?’ అని ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించింది.
కాకతీయుల శిల్పరీతులను పోలిన ఆకృతులు, దేశంలో వివిధ ఆలయాల్లో ఉన్న రూపాలను సర్కారు ముందుకు తెచ్చింది. వాటిపై ఆదివాసీల్లో ప్రత్యేకించి పూజారులు, ఆదివాసీ బుద్ధిజీవుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దశలవారీగా సమీక్షించింది. మేడారం పూజారులు, ఆదివాసీ సంఘాలు, పరిశోధకులు, వివిధ స్థాయిల ప్రతినిధులతో చర్చించి నూతన డిజైన్లను రూపొందించింది.
ఆదివాసీ సంప్రదాయాలు, ఆచారాలు, వారి జీవన విధానంలో భాగమైన, వారి తెగగొట్టులను తెలిపే ఆకృతులు గద్దెల ప్రాంగణం, లోపలా, బయటా ఉట్టిపడేలా కొత్త డిజైన్లను మార్చింది. ఆ నవీన నమూనాలను సీఎం మంగళవారం ఆవిష్కరించారు. సమ్మక్క, సారలమ్మ పోరాట స్ఫూర్తి వచ్చే వెయ్యేండ్ల వరకు జాతర భక్తులకు వారసత్వంగా ఉండేలా తాము జాగ్రత్తలు తీసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క పేర్కొన్నారు.