వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 13 : సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు అంబరాన్నంటేలా నిర్వహిస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం అజాంజాహి మిల్స్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సంక్షేమ పాలనపై ప్రజలకు మరింత వివరించడానికే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. అర్థం లేని యాత్రలతో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం చెబుతామన్నారు. గ్రౌండ్లో సుమారు రెండెకరాల స్థలంలో కాకతీయ ఇన్నోవేషన్స్ ఆధ్వర్యంలో నూతన సెక్రటేరియట్ (సచివాలయం)నమూనాతో భారీ సెట్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ జీవిత చరిత్రతో పాటు తెలంగాణ చరిత్ర, ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పూర్తి సమాచారాన్ని ఫొటో ఎగ్జిబిషన్ రూపంలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నేతలు హాజరవుతారని తెలిపారు.
మంత్రుల చేతుల మీదుగా..
కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న మూడు రోజుల వేడుకలను 15వ తేదీన మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభిస్తారని ఎమ్మెల్యే నరేందర్ తెలిపారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించి, క్రిస్టియన్‌కాలనీ, గిరిప్రసాద్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న రెండు బస్తీ దవాఖానలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సాయంత్రం 6 నుంచి 9గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 16వ తేదీన సచివాలయ నమూనాలో నిర్మించిన భారీ సెట్లో ఫొటో ఎగ్జిబిషన్‌ను విద్యార్థులు వీక్షించేలా ఏర్పాట్లు చేశామని, అర్ధరాత్రి భారీ కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 17వ తేదీ సినీ, సాంస్కృతిక రంగాలకు చెందిన కళాకారులతో కార్యక్రమాలను నిర్వహిస్తామని, సీఎం కేసీఆర్ జీవిత చరిత్ర, రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూ కృష్ణవేణి రచించగా, గాయకుడు కారుణ్య ఆలపించిన గీతాన్ని ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 18న మహా శివరాత్రి సందర్భంగా రాజకీయాలకు అతీతంగా సాయంత్రం 6 నుంచి 19వ తేదీ ఉదయం 6 గంటల వరకు మహా జాగరణ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.
త్వరలో కలెక్టరేట్ నిర్మాణ పనులను ప్రారంభిస్తాం..
జిల్లాలో త్వరలోనే సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే సీఎం చేతుల మీదుగా భూమి పూజా కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.