భీమదేవరపల్లి, అక్టోబర్ 24: పదవ తరగతి చదువుతున్న వనం శ్రీవర్ష (14) అనే విద్యార్థిని ఎవరు లేని సమయంలో డార్మెంటరీ హాల్లో చున్నీతో ఉరివేసుకున్న సంఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని పీవీ రంగారావు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థుల కథనం మేరకు.. శ్రీ వర్ష సెలవులకు వెళ్లి గురువారమే పాఠశాలకు తిరిగి వచ్చింది. ఈరోజు ఉదయం ఉపాధ్యాయురాలి సెల్ నుండి ఆమె తల్లిదండ్రులకు కాల్ చేసింది. తనను వెంటనే తీసుకెళ్లాలని, ఇక్కడ ఉండనని మొరపెట్టుకుంది.
దీంతో తల్లిదండ్రులు తీసుకెళ్లేందుకు పాఠశాలకు వస్తున్నామని బదులిచ్చారు. ప్రార్థన సమయం కావడంతో విద్యార్థులందరూ బయటకు రాగా శ్రీ వర్ష కనిపించలేదు. దీంతో డార్మెంటరీ హాల్ కి వెళ్లి చూడగా ఆమె చున్నీతో ఉరివేసుకొని విగత జీవిలా కనిపించింది. వెంటనే ఉపాధ్యాయులు ఆమె తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. శ్రీవర్ష స్వస్థలం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్. కాగా సంఘటన స్థలాన్ని ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ఎస్ఐలు దివ్య, ప్రవీణ్ కుమార్ చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.