హనుమకొండ చౌరస్తా, మార్చి 26 : సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవినీతిని అంతం చేయాలంటే ప్రతి పౌరుడు సరిహద్దులోని సైనికుడిలా పోరాడా లని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ పిలుపునిచ్చారు. అవినీతిపై పోరాటం చేయడం ప్రతి ఒకరూ ప్రథమ కర్తవ్యంగా భావించాలని యువతను కోరారు. అవినీతి వ్యతిరేక సంస్థ ‘జ్వాల’ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండలోని లోక్‌సత్తా జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్ సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణను ఏసీబీకి పట్టించిన శివరాజ్, హనుమకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవిని ఏసీబీకి పట్టించిన గోపా ల్, ఎన్పీడీసీఎల్ స్టేషన్‌ఘన్‌పూర్ డీఈ హుస్సేన్‌నాయక్‌ను పట్టించిన విజయ్‌లను జ్వాలా ఆధ్వర్యంలో నగదు బహుమతులు అందించి సన్మానించా రు. ఈ సందర్భంగా జయప్రకాశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు మారుతున్నా అవినీతి మాత్రం తగ్గడం లేదన్నారు.
అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వారిని సన్మానిస్తూ, ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న జ్వాల వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్‌ను అభినందించారు. ఇలాం టి కార్యక్రమాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. అత్యంత అవినీతి కలిగిన దేశాల్లో భారత్ 96వ స్థానంలో ఉన్నదని, ఏటా మరింత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నదని ప్రశాంత్ ఆందోళన వ్య క్తం చేశారు. ఏసీబీకి చికిన ప్రభుత్వ అధికారులను ప్రభుత్వం వెంటనే విధు ల నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లోక్‌సత్తా రాష్ట్ర సలహాదారులు ప్రొఫెసర్ కోదండరామారావు, డాక్టర్ అంజలి దేవి, జ్వాల సభ్యులు అచ్చే అమర్నాథ్, ప్రకాశ్, సురేశ్ పాల్గొన్నారు.