వరంగల్, అక్టోబర్ 13 : పాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సర్కిల్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సర్కిల్ కార్యాలయాల్లో కింది స్థాయి ఉద్యోగి నుంచి అధికారులదే హవా. అడిగింది ఇస్తే చాలు ఏదైనా చిటికెలో చేసి పెడుతున్నారు. గ్రేటర్‌లోని అన్ని విభాగాల వింగ్ అధికారులు తమ కింది స్థాయి ఉద్యోగులు, కారు డ్రైవర్లతో సెటిల్మెంట్లు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కమిషనర్లు సర్కిల్ కార్యాలయాల వైపు కన్నెత్తి చూడకపోవడం అక్కడ ఉద్యోగులది ఆడింది ఆట.. పాడింది పాటగా మారుతోంది. నాలుగేళ్ల నుంచి ఇక్కడ పని చేసిన ఏ ఒక్క కమిషనర్ సర్కిల్ కార్యాలయాల మెట్లు ఎక్కిన దాఖలాలు లేవు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నాలు చేయలేదంటే అతిశయోక్తి కాదు. అంతా డిప్యూటీ కమిషనర్ల పర్యవేక్షణలో సర్కిల్ కార్యాలయాల పాలన సాగిస్తున్నారు. ఉద్యోగులు, డిప్యూటీ కమిషనర్లు అంతా ఒక్కటై కార్యాలయానికి వచ్చిన ప్రజలను దోచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తనిఖీలు, సమీక్షలు కరువు..
గ్రేటర్ సర్కిల్ కార్యాలయాల వైపు కమిషనర్లు కన్నెత్తి చూడడం లేదు. ఆకస్మిక తనిఖీలు, సమీక్షలు చేసిన సందర్భాలు లేవు. నాలుగేళ్ల క్రితం కమిషనర్‌గా పనిచేసిన వీపీ గౌతం మాత్రం సర్కిల్ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేసేవారు. అధికారులు, ఉద్యోగులతో సమీక్ష నిర్వహించే వారు. ఎప్పుడు తనిఖీలు నిర్వహిస్తారో అని సర్కిల్ కార్యాలయాల ఉద్యోగులు వణికిపోయే వారు. ఆయన బదిలీ అయిన తర్వాత వచ్చిన కమిషనర్లు సర్కిల్ కార్యాలయాలకు వెళ్లిన దాఖలాలు లేవు. గ్రేటర్ పరిధిలోని రెండు కాజీపేట, కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయాల్లో డిప్యూటీ కమిషనర్ల పాలన సాగుతోంది. డిప్యూటీ కమిషనర్లుగా పనిచేసిన వారు గతంలో ఇక్కడ పనిచేసిన వారే కావడంతో అవినీతికి అడ్డూలేకుండా పోతుందన్న అరోపణలు ఉన్నాయి. అధికారులు, ఉద్యోగులు కార్యాలయాల కింద తమ మనుషులను నియమించుకుని సెటిల్మెంట్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సర్కిల్ కార్యాలయాలపై ప్రత్యేక దృష్టిసారించాలి. ప్రతి నెల కమిషనర్ సర్కిల్ కార్యాలయానికి వెళ్లి అక్కడే సమీక్షలు నిర్వహిస్తే సర్కిల్ కార్యాలయాల పాలన గాడిలో పడుతుంది.
డీల్ కుదిరితేనే ఫైల్ కదిలేది..
ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల ఉద్యోగులు సర్కిల్ కార్యాలయాల్లోనే సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. కొత్త ఇంటి నంబర్, ఇంటి నిర్మాణ అనుమతి కోసం సర్కిల్ కార్యాలయాల మెట్లు ఎక్కితే చాలు అక్కడ ఉద్యోగులు చుక్కలు చూపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. డీల్ కుదిరిన తర్వాత ఈ ఆఫీస్‌లో ఫైల్ కదులుతుంది. ఇంజినీరింగ్ విభాగం అధికారులది అంతా ప్రధాన కార్యాలయం వద్ద సెటిల్మెంట్ జరుగుతుంది. అధికారుల వాటా ముట్టజెప్పిన వారి బిల్లులు మాత్రమే చెల్లిస్తారు. లేదా రాజకీయ పలుకుబడి ఉన్నా బడా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులు జరుగుతాయి. చిన్నస్థాయి కాంట్రాక్టర్లు ఏళ్ల తరబడి ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
ఏసీబీ దాడులతో వణికిపోతున్న ఉద్యోగులు
రెండు రోజుల కిత్రం ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో గ్రేటర్ ఉద్యోగులు వణికిపోతున్నారు. ముఖ్యంగా సర్కిల్ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల్లో భయం పట్టుకుంది. ఇప్పటికే పనులు చేసిపెడుతామని డీల్ కుదుర్చుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఆర్ఐ రబ్బాని, బిల్ కలెక్టర్ రంజిత్‌ను కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయంలో విచారణ చేసిన నేపథ్యంలో ఉద్యోగులకు భయం వీడడం లేదు. కొత్త వ్యక్తులు ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, ట్యాక్సేషన్ విభాగాల అధికారుల గురించి అడిగితే చాలు తమకు తెలియదంటూ అటెండర్లు సమాధానం చెబుతున్నారు. ప్రధాన కార్యాలయంతో పాటు సర్కిల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడుల ఘటనపైనే చర్చజరుగుతోంది.