ఖిలావరంగల్, ఏప్రిల్ 28 : రైల్వే ప్రయాణికులు అప్రమతంగా ఉంటూ తన గమ్య స్థానాలకు సురక్షితంగా చేరాలని వరంగల్ ఆర్పీఎఫ్ సీఐ పీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశ వ్యాప్తంగా చేపట్టిన భద్రత చర్యల్లో భాగంగా సోమవారం వరంగల్ రైల్వేస్టేషన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రయాణికులకు భద్రతపై బరోసా కల్పించేందుకు స్టేషన్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోగీలలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనించినట్లయితే రైలులోని ఆర్పీఎఫ్, జీఆర్చీ, రైల్వే సిబ్బంది దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు.
అలాగే పేలుడు, మండే స్వభావం కలిగి వస్తువులను తరలించడం చట్ట రీత్యా నేరమన్నారు. విలువైన వస్తువలతో ప్రయాణించేవారు ఎప్పటిప్పుడు తమ వస్తువులను సరి చూసుకోవాలన్నారు. రైలు ప్రయాణంలో కిటికి వద్ద కూర్చునే మహిళలు అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే చైన్ స్నాచింగ్ జరిగే అవకాశం ఉందన్నారు. బంగారు ఆభరణాలు కనిపించకుండా జాగ్రత్త పడాలన్నారు. అనుమానిత వ్యక్తులు గాని, సంఘ విద్రోహక శక్తుల గురించి లేదా చోరీ జరిగిన వెంటనే ప్రయాణికులు టోల్ ఫ్రీ నెం. 139 సమాచారం ఇవ్వాలన్నారు. సమచారం ఇచ్చిన వెంటనే రైలులోని పోలీసులు గాని లేదా తదుపరి రైల్వేస్టేషన్లోని పోలీసులు అసంఘీక శక్తుల భరతం పడుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఎస్సై జీ వెంకటేశ్వర్లు, ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.