బచ్చన్నపేట ఆగస్టు 22 : బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించే నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని నర్మెట సీఐ అబ్బయ్య సూచించారు. శుక్రవారం ఎస్సై హమీద్ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పక పాటించాలన్నారు. గణేష్ మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. ప్రతి మండపం వద్ద తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల సూచించారు. నిర్దేశించిన సమయనికి నిమజ్జనం పూర్తి చేయాలన్నారు.
అనుమతులు తప్పనిసరి
గణేష్ మండపాలు ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలకు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్ల ను మండపంలో ఏర్పాటు చేయాలన్నారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలన్నారు.
మండపాల వద్ద డీజేలు ఏర్పాటు చేయరాదన్నారు. గణేష్ మండపాల వద్ద ఎప్పుడైన అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట అడటం, అసభ్యకరమైన నృత్యాల ఏర్పాటు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం,పాటలు పాడటంపై పూర్తిగా నిషేధం అని వెల్లడించారు. పోలీసు తనిఖీలకు సహకరించాలి, పాయింట్ బుక్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.
వదంతులు నమ్మొద్దు
మండపాల వద్ద ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు వ్యక్తులు కనిపించినట్లుయితే తక్షణమే డయల్ 100 కి గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి పుకార్లు, వదంతులను నమ్మకూడదు అని ఎవ్వరికైన ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత పోలీసు వారికి లేదా డయల్ 100 కి సమాచారం అందించాలని సూచించారు.