భీమదేవరపల్లి, జూలై 07: కాకతీయ యూనివర్సిటీలో జరిగిన 23వ స్నాతకోత్సవంలో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామానికి చెందిన చిట్టంపల్లి రంజిత్ కుమార్ ఎంఏ పొలిటికల్ సైన్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ అవార్డును రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ చేతులమీదుగా అందుకున్నారు. పేద కుటుంబంలో పుట్టిన రంజిత్ కుమార్ చిన్ననాటి నుంచే చదువు పట్ల అత్యంత ఆసక్తి కనబరిచేవాడు.
అతని తండ్రి వంగరలోని పీవీ రంగారావు బాలికల గురుకుల పాఠశాలలో వాచ్ మెన్ గా పనిచేయగా అనారోగ్యం కారణంగా విధులకు దూరమయ్యాడు. అప్పటినుంచి అతని తల్లి సహకారంతో రంజిత్ కుమార్ ఉన్నత చదువులు చదువుకోగలిగాడు. రంజిత్ కుమార్ ప్రస్తుతం న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నాడు. ఇష్టపడి చదివితే ఉన్నత లక్ష్యాలను అలవోకగా సాధించవచ్చని రంజిత్ కుమార్ నిరూపించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన రంజిత్ కుమార్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.