వరంగల్, ఆగస్టు 4 : వానకాలంలో ముంపు సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు సమాయత్తం కావాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఆదేశించారు. సోమవారం వరంగల్ నగరానికి విచ్చేసిన ఆయన కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ముంపు నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద సమయంలో ముంపు బాధితులకు ఇబ్బందులు పునారావృతం కాకుండా చూడాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వరద నివారణ చర్యలు ఇప్పటి నుంచే చేపట్టాలని, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నగరంలోని ప్రధాన నాలాల పూడికతీత పూర్తి చేయాలని, వరద నీరు బయట నిల్వ ఉండకుండా డ్రైనేజీల్లోకి మళ్లించాలన్నారు. ఆగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు ముంపు ప్రాంతాల్లో చేపట్టే సహాయక చర్యల్లో కీలకంగా వ్యహరించాలన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు.
ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ దామోదర్ సింగ్ మాట్లాడుతూ ముందస్తు చర్యలు పక్కాగా చేపడితే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చన్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ సహాయ చర్యల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్ 18004253424 అందుబాటులో ఉంచామన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహా శబరీష్ మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలోని 193 లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ వర్షపాత తీవ్రతను గుర్తించి అధికారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. కార్పొరేషన్ కంట్రోల్ రూమ్‌లో 18004251980, 9701999645, 9701999676 టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశామన్నారు.
వరద ముంపు ప్రాంతాలను విపత్తుల నిర్వహణ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భద్రకాళీ చెరు వు, నయీంనగర్ నాలా, రాజాజీనగర్ నాలా, ప్రెసిడెన్సీ పాఠశాల నుంచి నయీంనగర్ వరకు నిర్మించిన రిటర్నింగ్ వాల్, జవహర్‌నగర్, సమ్మయ్యనగర్ను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూ చనలు చేశారు. సమావేశంలో ఆదనపు కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఇంజినీరింగ్, పారిశుధ్య, ఎలక్ట్రికల్, డీఆర్ఎఫ్, టౌన్ ప్లానింగ్, స్మార్ట్‌సిటీ విభాగాల అధికారులు పాల్గొన్నారు.