Munjala Archana | భరతనాట్యం, పేరిణి, ఆంధ్రా, జానపద, ఫోక్.. ఇలా ఏ నృత్యమైనా ఆ చిన్నారి చేస్తే అబ్బురపడాల్సిందే. నాలుగేళ్లకే కాలికి గజ్జెకట్టి ఆరేళ్ల నుంచి నాట్యంలో విశేష ప్రతిభ కనబరుస్తోంది. మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన ముంజాల అర్చన శాస్త్రీయ నృత్య కళాకారిణిగా రాణి స్తోంది. అతి తకువ కాలంలో 100కు పైగా సాంసృతిక నృత్య ప్రదర్శనలు చేసినందుకు చాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లిటిల్ చాంప్-2023ని దక్కించుకుంది. వీటితో పాటు బాల పురస్కార్, ఇండియా బుక్ రికార్డు వంటి ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది.
– కురవి, మే 18
సంప్రదాయ నృత్యమైనా.. అత్యంత కష్టతరమైన భరత నాట్యమైనా ఆరేళ్ల చిరుప్రాయంలోనే అర్చన ఎంతో పరిణితి కనబరుస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ర్టాల్లో అతితక్కువ సమయంలో 100కుపైగా ప్రదర్శనలు ఇచ్చిన ఘనతను సొంతం చేసుకుంది. అత్యుత్తమ తెలంగాణ బాలరత్న అవార్డును దక్కించుకుంది. పుట్టింది మా రుమూల ప్రాంతమైనా సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమి లేదని నిరూపించింది.
తల్లే తొలి గురువు..
కురవి మండల కేంద్రానికి చెందిన ముంజాల శ్రీను-ఉమ దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు ఆకాశ్, కుమార్తె అర్చన. ఉమ ఫోక్ డ్యాన్స్ కళాకారిణి. నాట్యంలో ఉన్నతంగా ఎదగాలని ఆమెకు ఉన్నా ఆ అవకాశం లేకపోయింది. కుమార్తెకైనా నేర్పించాలనే ఆలోచనతో భర్తను ఒప్పించి ఇద్దరు పిల్లలతో కలిసి ఖమ్మం వెళ్లింది. తన అభిరుచికి తగ్గట్టుగానే కుమార్తె అర్చన చిన్నతనం నుంచే స్టేజ్ ఫియర్ లేకుండా నేర్చుకుంది. అర్చనకు ఐదేళ్లు రాగానే లలిత డ్యాన్స్ అకాడమీ డ్యాన్స్ మాస్టర్ వీరునాయక్ నేతృత్వంలో ఖమ్మం రోటరీ నగర్‌లోని రాజరాజేశ్వరి కల్యాణ మండపంలో నృత్య శిక్షణలో చేర్పించింది. ఏడాది పాటు శిక్షణ తీసుకున్న అర్చన నాట్యంలో అద్భుతమైన ప్రతిభ చూపి అనేక పురసారాలను అందుకుంది.
భరతనాట్యం, పేరిణి నృత్యం, ఆంధ్రానాట్యం, జానపద కళా నృత్యాల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణించి రికార్డ్స్, అవార్డ్స్, ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించింది. నృత్యంతో పాటు ఖమ్మంలోని గూగుల్ కిట్స్ ప్రైమరీ స్కూల్లో యూకేజీ చదువుకుంటోంది. అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఆర్ట్ గ్యాలరీ ఔరంగాబాద్‌లో జరిగిన సాంసృతిక డ్యాన్స్ పోటీల్లో పాల్గొని రబీంద్రనాథ్ ఠాగూర్ కళావిభూషణ్ అవార్డు దక్కించుకుంది. అనతికాలంలోనే 100కు పైగా నృత్య ప్రదర్శనలు చేసినందుకు చాంపియన్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు లిటిల్ చాంప్-2023ని కైవసం చేసుకుంది. భరతనాట్యంలో 57 ముద్రలు సంయుక్త, అసంయుక్త ముద్రలను 24 సెకండ్లలో చెప్పి ఇండియా బుక్ అఫ్ రికార్డును సొంతం చేసుకుంది. అత్యధిక ప్రదర్శనలు చేసి తెలంగాణ బాల కళారత్న అవార్డును దక్కించుకుంది.
1. బెస్ట్ క్లాసికల్, ఫోక్ డ్యాన్స్ ప్రదర్శనకు రబీంద్రనాధ్ ఠాగూర్ కళా విభూషణ్ అవార్డు (22.03.23), అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఆర్ట్ గాలరీ, ఔరంగాబాద్
2. ఇండియా బుక్ అఫ్ రికార్డు (22.2.2023)
3. చాంపియన్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు లిటిల్ చాంప్-2023(4.3.2023)
4. నేషనల్ బుక్ అఫ్ రికార్డు భారత్ విభూషణ్, న్యూఢిల్లీ(10.3.2023)
5. గ్లోబల్ అచీవర్స్ అవార్డు, తమిళనాడు ప్రభుత్వం(28.3.2023)
6. భారత్ నృత్య సమ్మాన్ అవార్డు, బెంగళూరు హీన డాన్స్ అకాడమీ(21.1.2023)
7. ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు(1.3.2023)
8. రాష్ట్రీయ ప్రతిష్ట పురసార్ నేషనల్ అవార్డు(25.2.2023)
9. భారత్ గోరావ్ సమ్మాన్ అవార్డు(5.3.2023)
10. ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు(10.2.23)
11. సంగీత కళా భూషణ్ అవార్డు, ఒడిశా(1.4.2023)
12. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు(19.4.2023)
13. తెలంగాణ బాల రత్న అవార్డు(24.4.2023)
తెలంగాణ నుంచి శాస్త్రీయ నృత్యంలో అత్యంత ప్రతిభ కనబరిచ్చినందుకు, అఖిలభారత తెలుగు సమాఖ్య సేవాసంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు చేతులమీదుగా తెలంగాణ బాలరత్న అవార్డు అందుకుంది.