హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 2: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ పార్టి సీనియర్ నేత చల్లా వెంకటేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను అమ్మకానికి కుట్రలు పన్నుతుండటం పట్ల ఆయన మండిపడ్డారు. హెచ్సీయూ భూములను అమ్మాలని చూడటం అన్యాయమని, యూనివర్సిటీ భూములను అమ్మి సొమ్ము చేసుకోవాలనుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో హెచ్సీయూ యూనివర్సిటీ ప్రాంతంలో జీవవైవిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
400 ఎకరాల యూనివర్సిటీ భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లకుండా కాపాడిందని, ఇప్పుడు 400 ఎకరాల భూములను వేలం వేయాలనే ప్రక్రియను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. వర్సిటీలో చెట్లను నరికివేసి, చదును చేస్తూ ప్రభుత్వం అరాచకానికి పాల్పడటం సరైంది కాదన్నారు. అడ్డు వచ్చిన విద్యార్హులపై లాఠీఛార్జీ చేయడం అమానుషమన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడటం మంచిది కాదని ప్రభుత్వం పోలిసుల ద్వారా భయపెట్టి భూములు వేలం వేయాలని చూడటం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం భూమి వేలం వేయలానుకునే నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.