వరంగల్, జనవరి 8(నమస్తేతెలంగాణ) : గంగదేవిపల్లి గ్రామంలో ఇంట్లో ఉన్న ఓ వృద్ధురాలిపై దాడి చేసి ఆమె మెడలోని బంగారం గొలుసును అపహరించిన నిందితుడు పక్కా ప్రొఫెషనల్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చోరీకి ముందు ఈ చైన్‌స్నాచర్ ఇంటిపై రెక్కీ నిర్వహించినట్లు భావిస్తున్నారు. పకడ్బందీ ప్రణాళికతోనే దొంగతనానికి ఒడిగట్టినట్లు విశ్వసిస్తున్నారు. గీసుగొండ మండలం గంగదేవిపల్లిలో వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఒక ఇంటి వద్దకు శనివారం సాయంత్రం బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి తాగునీరు అడిగి వృద్ధురాలు మేడిద నర్సమ్మపై దాడి చేసి ఆమె మెడలో నుంచి బంగారం గొలుసును లాక్కుని పరారైన విషయం తెలిసిందే. కాగా, సమాచారం అందగానే శనివారం సాయంత్రం ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, క్రైం అడిషనల్ డీసీపీ పుష్ప, మామునూరు ఏసీపీ నరేశ్‌కుమార్, వరంగల్ సీసీఎస్ పోలీసులు ఆ ఇంటిని సందర్శించారు. వివరాలను బాధితురాలి ద్వారా తెలుసుకున్నారు.
చోరీ కేసును ఛేదించేందుకు వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ప్రత్యేకంగా నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలతో పాటు సిబ్బంది ఉన్నారు. ఆదివారం క్రైం డీసీపీ చోరీ జరిగిన ఇంటిని సందర్శించి వివరాలను సేకరించారు. మామునూరు ఏసీపీ నరేశ్‌కుమార్ కేసు దర్యాప్తును పర్యవేక్షించారు. ఘటన జరిగినప్పటి నుంచి సీపీ ఎప్పటికప్పుడు కేసు పురోగతి తెలుసుకుంటున్నారు. పోలీసులు సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు.
వృద్ధురాలిపై దాడికి పాల్పడింది ఒకే వ్యక్తి అని, తెలుగులో మాట్లాడినందున ఇతర రాష్ర్టాలకు చెందిన వాడు కాదని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా నిందితుడు బంగారు గొలుసును అపహరించేందుకు వృద్ధురాలిపై దాడి చేయడాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఇదే రోజు సంగెం మండలం గవిచర్ల గ్రామంలోని ఓ ఇంట్లో పట్టపగలు దొంగతనం జరిగింది. దుండగులు ఓ ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని 12.25 తులాల బంగారు ఆభరణాలను అపహరించాడు. ప్రాథమికంగా లభించిన ఆధారాలతో గవిచర్ల చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. గంగదేవిపల్లిలో చోరీకి పాల్పడింది ప్రొఫెషనల్ కావడంతో ఆధారాలేమీ లభించలేదు. దీంతో ఈ కేసులో పోలీసులు అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.