వరంగల్, జూన్ 13 : అధికారులు, ఉద్యోగుల సహకారంతో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని బల్దియా కొత్త కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆమె కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరీంనగర్ కార్పొరేషన్లో పనిచేసిన అనుభవం ఉన్నదని, మున్సిపల్ సర్వీస్‌లపై అవగాహన ఉన్నదని చెప్పారు.
చారిత్రక నగరమైన వరంగల్‌కు కమిషనర్‌గా రావడాన్ని మంచి అవకాశంగా భావిస్తున్నానని.. ముఖ్యంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించి పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తానని పేర్కొన్నారు. వన మహోత్సవంలో భాగంగా నగరంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు. పారిశుధ్య విభాగంలో కార్మికుల సంఖ్య, చెత్త తరలింపు వాహనాలు, జీపీఎస్ అనుసంధానం, తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన చాహత్ బాజ్‌పాయ్‌కు బల్దియా ఉద్యోగుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పూల మొక్కలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ కమిషనర్లు రాజేశ్వర్, రవీందర్, ప్రసన్నరాణి, సీఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, డాక్టర్ రాజేశ్, ఇన్చార్జి ఈఈ శ్రీనివాస్, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, పీఆర్వో ఆయూబ్ అలీ, ఈఈలు, డీఈలు, ఆర్వో, ఆర్ఐలు పాల్గొన్నారు.