రాయపర్తి/మరిపెడ, ఆగస్టు6: వరంగల్ జిల్లా రాయపర్తి, మహబూబాబాద్ జిల్లా మరిపెడలో అనుమతి లేని క్లినిక్‌లను సీజ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వైద్యారోగ్య, రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో దాడులు చేసి పరిమితికి మించి వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. రాయపర్తిలో పరిమితులు దాటి వైద్యం చేస్తున్న భవానీ క్లినిక్‌పై గిర్దావర్ కొయ్యాడ చంద్రమోహన్, పోలీస్ సిబ్బంది సుమన్, వైద్యారోగ్య సిబ్బంది మథ్యాస్‌రెడ్డి, శ్యాంసుందర్, బుర్ర రవీందర్‌గౌడ్‌తో కలిసి వర్ధన్నపేట డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ గోపాల్‌రావు దాడులు నిర్వహించారు.
ఫార్మా-డీ విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేసిన జేరిపోతుల కృష్ణ క్లినిక్‌తోపాటు సొంతంగా ఫార్మసీని ఏర్పాటు చేసుకుని వైద్యం అందిస్తున్నట్లు గుర్తించారు. పరిమితులకు మించి వైద్యం చేస్తున్న అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణకు నివేదిక అందజేస్తానని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో తెలిపారు. భవానీ క్లినిక్‌ను రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారుల సమక్షంలో సీజ్ చేసి తాళాలు వేశారు. మరిపెడలో స్థానికుల ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి కళావతీ బాయి ఓ ప్రైవేట్ క్లినిక్‌ను తనిఖీ చేసి ఎలాంటి అనుమతులు లేకపోవడంతోపాటు పరిమితికి మించి రోగులకు వైద్యం అందిస్తుండగా సీజ్ చేశారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి రవికుమార్ తదితరులు ఉన్నారు.
నర్సంపేట: నర్సంపేటలో ఇద్దరు నకిలీ వైద్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ వైద్య మండలి రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్యకుమార్ ఆదేశాల మేరకు ఎన్ఎంసీ చట్టం 34, 54 టీఎస్ఎంపీ 22 ప్రకారం నకిలీ వైద్యులు జయేందర్‌రెడ్డి, శ్యాంప్రసాద్లపై కేసు ఫైల్ చేశారు. గత నెలలో వైద్య మండలి అధికారులు పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేశ్‌కుమార్ నేతృత్వంలో చేసిన తనిఖీల్లో సదరు వైద్యులు విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. వీటితో భవిష్యత్‌లో చాలా దుష్పరిణామాలు ఉంటాయని డాక్టర్ శేషుమాధవ్ తెలిపారు.