మహదేవ్పూర్, జూన్ 11: చిన్నారుల సమగ్ర అభివృద్ధి అంగన్వాడీ కేంద్రాల్లోనే సాధ్యమవుతుందని ఐసీడీఎస్ సీడీపీవో రాధిక అన్నారు. మండల పరిధిలోని ఎల్కేశ్వరం, మేడిగడ్డ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రధాన రహదారుల గుండా ర్యాలీ చేపట్టి అవగాహన కల్పించారు. సెల్ఫీ విత్ మై అంగన్వాడీ అంటూ పిల్లలు తల్లులతో ఫొటోలు దిగారు. రెండున్నర నుండి ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని, సెంటర్లకు అందుతున్న సేవలపై తల్లులకు వివరించారు.
పిల్లలకు ఆటపాటలతో పాటు సృజనాత్మక పెంపొందించే విధంగా విద్యాబోధన ఉంటుందన్నారు. ఈ ఏడాది నుండి పిల్లలకు ఎగ్ బిర్యానీ పెట్టనున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అంగన్వాడీలో పూర్వ ప్రాథమిక విద్య అందుబాటులో ఉందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడీ టీచర్లు ఆయాలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.