ఖిలావరంగల్, ఆగస్టు 7 : చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలోని ‘మౌంటెడ్ పోలీసు’ ఏర్పాటు కలగానే మిగిలిపోయేలా ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్‌లో అశ్వక దళం ఏర్పాటు చేయడంతోపాటు పోలీసులకు ఉపకరించేలా గుర్రాలను సంరక్షించేందుకు అశ్వశాలను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించారు.
ఈ క్రమంలో దూర ప్రాంతాల నుంచి కోటకు వచ్చే పర్యాటకుల ముందుకు నగర పోలీసుల అశ్వక దళ కవాతును తీసుకురావాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ కేంద్ర పురావస్తు శాఖ కొర్రీలు పెట్టింది. దీంతో గుర్రాల కోసం నిర్మించిన గదులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారా యి. ఖాళీగా ఉన్న గదుల్లో గతంలో కొంత మంది మిర్చి వ్యాపారం నిర్వహించగా, ప్రస్తుతం ఓ ప్రైవేట్ వ్యక్తి కబ్జా చేసి యథేచ్ఛగా డెయిరీ ఫాం నడిపిస్తున్నారు.
అశ్వకం దళం కలేనా?
గ్రేటర్ హైదరాబాద్ తరహాలో వరంగల్‌లో అశ్వక దళం ఏర్పాటు చేయాలని గత బీఆర్ఎస్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. చారిత్రక కోటలో ‘మౌంటెడ్ పోలీస్’ ఏర్పాటు చేస్తే పర్యాటకులకు మరింత కనువిందు చేయవచ్చనే ఉద్దేశంతో 1 అక్టోబర్ 2016లో అప్పటి కలెక్టర్ వాకాటి కరుణ, పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు మట్టికోట వాయువ్య ప్రాంతంలో(లక్ష్మీపత్రి గండి) కోట గర్భంలో దాగి ఉన్న రెండు త్రికూటాలయాలకు సమీపంలో స్థల పరిశీలన చేశారు.
పదెకరాల ప్రభుత్వ భూమిలో ఐదున్నర ఎకరాలు కేటాయించి నిధులు విడుదల చేశారు. గుర్రాల కోసం పది గదులు, వాటి సంరక్షణతో పాటు శిక్షకుల కోసం ఒక గదిని నిర్మించారు. నిర్మాణం పూర్తయ్యే వరకు వేడుక చూసిన కేంద్ర పురావస్తు శాఖ నిబంధనలకు విరుద్ధమంటూ కొర్రీలు పెట్టింది. నోటీసులు జారీ చేసి అడ్డుకుంది. అప్పటి నుంచి అశ్వక దళం కలగా మారిపోయిందనే విమర్శలున్నాయి.
దర్జాగా డెయిరీ ఫాం..
రూ. లక్షలు వెచ్చించి మౌంటెడ్ పోలీస్ కోసం నిర్మించిన గదులు ప్ర స్తుతం పశువుల పాకగా మారాయి. కబ్జా చేసి దర్జాగా డెయిరీ ఫాం నిర్వహిస్తున్నారు. ఇదే అదనుగా అసాంఘిక శక్తులు అడ్డాగా మార్చుకున్నా యి. రాత్రయిందంటే మత్తు పదార్థాలు, మద్యం తాగుతున్నా పట్టించుకోనేవారు లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు. ‘మౌంటెడ్ పోలీస్’ను చారిత్రక నగర ప్రజల ముందుకు తీసుకురావాలని కోరుతున్నారు.