మహబూబాబాద్, మే 28 : మహబూబాబాద్ ఆర్టీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. రవాణా శాఖ కార్యాలయాల్లో కొన్నేళ్లుగా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయనే సమాచారంతో ఏసీబీ డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలతో వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, ఏసీబీ సీఐలు శ్యాంసుందర్, ఎల్ రాజు, ఎస్ రాజు, సిబ్బందితో కలిసి మహబూబాబాద్ ఆర్టీవో కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఆరుగురు ఏజెంట్లు లెర్నింగ్, పర్మినెంట్, ఫిట్నెస్లకు సంబంధించిన డాక్యుమెంట్లు నగదుతో ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా డీటీవో గౌస్‌పాషా డ్రైవర్ సుబ్బారావు వద్ద డాక్యుమెంట్లు, రూ.16 వేల నగదు లభ్యం కావడంతో వాటిని సీజ్ చేశారు. తనిఖీల సమయంలో డీటీవో లేడని, అయినప్పటికీ ఈ అక్రమ వసూళ్లకు సంబంధించి ఆయనకు బాధ్యత ఉంటుందని, ఏజెంట్లు, డ్రైవర్, ఎంవీఐలు సాయిచరణ్, సంగెం వెంకటపుల్లయ్యను సైతం విచారిస్తునట్లు ఏసీబీ డీఎస్పీ వివరించారు. మిగతా వివరాలను ఏసీబీ డీజీపీ సీవీ.ఆనంద్ ఆదేశాల మేరకు మీడియాకు వెల్లడిస్తామన్నారు.