వరంగల్, జూన్ 27 : స్వచ్ఛ ఆటో డ్రైవర్లు చెత్త తరలింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. మంగళవారం ఆయన బాలసముద్రంలోని వెహికల్ షెడ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్ల డ్రైవర్లతో చెత్త తరలింపు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చెత్త తరలింపు సమయం లో చెత్త రోడ్డుపై పడకుండా ఉండేలా తప్పనిసరిగా కవర్లు కప్పుకోవాలన్నారు. వెహికల్ షెడ్‌కు వచ్చే వాహనాల సమయాన్ని నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. చెత్తను డంపింగ్ యార్డ్‌కు తరలించే టిప్పర్లు ఎక్కువ ట్రిప్పులు కొట్టాలన్నారు.
అనంతరం ఆయన నగరంలోని పలు ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తుమ్మలకుంట, వడ్డేపల్లి చెరువు, సాయిగణేశ్కాలనీ, బాలాజీ జంక్షన్, ఆటో నగర్, ప్రాంతాలను పరిశీలించి ముంపు నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం నయీంనగర్ ప్రాంతంలో భవన నిర్మాణ అనుమతుల నిమిత్తం స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోచమ్మకుంట, సీఎస్ఆర్ గార్డెన్ ప్రాంతంలో నిర్మించిన అపార్ట్మెంట్ కొలతలను పరిశీలించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సురేశ్‌జోషి, ఎస్ఈ కృష్ణారావు, సిటీ ప్లానర్ వెంకన్న, ఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, బయాలజిస్ట్ మాధవరెడ్డి, ఈఈ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్, డీఈ సారంగం, శానిటరీ సూపర్వైజర్ మాదాసి సాంబయ్య, ఏఈలు కార్తీక్‌రెడ్డి, సతీశ్, సౌజన్య పాల్గొన్నారు.
సమస్యలు విన్నవించిన కార్పొరేటర్
పోచమ్మమైదాన్ : వరంగల్ 13వ డివిజన్ దేశాయిపేట చిన్న వడ్డేపల్లి చెరువు ప్రాంతాన్ని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా సందర్శించగా పలు సమస్యలను కార్పొరేటర్ సురేశ్‌జోషి ఆయనకు విన్నవించారు. వర్షాకాలంలో చిన్న వడ్డేపల్లి చెరువు నిండడం వల్ల ఎల్బీ నగర్, గణేశ్‌నగర్, టీచర్స్ కాలనీ, ఏకశిలా నగర్ ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. దీని నివారణ కోసం పూర్తిస్థాయిలో మొరం పోయించాలని ఆయన కోరారు. అలాగే, బాలాజీ నగర్, సుందరయ్య నగర్ ప్రాంతాల్లో గుడిసెలు ఏర్పాటు చేయడం వల్ల చెరువులోకి వెళ్లే వర్షపు నీరు ఎల్బీ నగర్ వైపు కాలువ ద్వారా వచ్చే పరిస్థితి ఉందన్నారు. దీంతో వర్షపు నీరు ఇళ్లలోకి రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు ఆయన విన్నవించారు. దీనికి కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా స్పందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ముంపు నివారణ చర్యలు చేపట్టాలి
వరంగల్ : భద్రకాళీ బండ్ ప్రాంతంలోని కాలనీల్లో ముంపు నివారణ చర్యలను చేపట్టాలని గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాను భద్రకాళీ ట్యాంక్ బండ్ ఏరియా అభివృద్ధి సమితి ప్రతినిధులు కోరారు. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్‌ను సమితి అధ్యక్షులు మర్రి రవీందర్ నేతృత్వంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రతి వర్షాకాలంలో భద్రకాళీ ట్యాంక్ బండ్ హంటర్‌రోడ్డులోని సాయినగర్, ఎన్టీఆర్ నగర్, బృందావన్ కాలనీ, సంతోషిమాతా కాలనీలు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. బొందివాగు నుంచి రామన్నపేట రోడ్డులోని 12 మోరీల వరకు కచ్చా కాలువను యుద్ధప్రాతిపదికన తవ్వితే ముంపు ప్రమాదం నుంచి కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం భద్రకాళీ బండ్ నిర్మించిన నేపథ్యంలో పలు కాలనీలను ఎఫ్టీఎల్ నుంచి తొలగించాలని కోరారు. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం హైదరాబాద్ తరహాలో లేక్ ప్రొటక్షన్ కమిటీలో విచారించి, తగు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కమిషనర్‌ను కలిసిన వారిలో కన్నోజు జితేందర్, కుసుమ రమేశ్, వలబోజు శ్రీనాథ్, తాళ్లపల్లి రమేశ్, శ్రీపతి శ్రీహరి, పగడాల సృజన్ కుమార్, మెతుకూరి వెంకట్ ఉన్నారు.