హనుమకొండ, జూన్ 02 : నాడు నేడు తెలంగాణకు శాపం కాంగ్రెస్ పార్టీనే. 60ఏండ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన మహనీయుడు కేసీఆర్ అని మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకులు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే పార్టీ కార్యాలయ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి, తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ చారి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫొటోలకు పూలమాలలేసి నివాళులర్పించారు.
అనంతరం పార్టీ జెండాను దాస్యం వినయ్ భాస్కర్ ఎగరవేశారు. ఈ సందర్బంగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ కలను సహకారం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజలు పోరాటం, అమరవీరుల బలిదానాలు, టీఆర్ఎస్ పార్టీ పోరాటం తెలంగాణ స్వరాష్ట్రాన్ని సహకారం చేసిందని పేర్కొన్నారు. నాడు, నేడు కాంగ్రెస్ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే.. ఈ 18 నెల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైందని అన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ..కొట్లాడి సాధించుకున్న తెలంగాణను పదేండ్ల పాలనలో అన్ని రంగాల్లో దేశంలోనే అగ్ర భాగాన నిలిపిన నేత కేసీఆర్ అని పేర్కొన్నారు.
నాడు 14 ఏళ్ల క్రితం కేసీఆర్ ఒక్కడిగా మొదలై కోట్లాది మంది ప్రజలను పోగుచేసి తెలంగాణ స్వరాష్ర్ట కలను సహకారం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ ఆగమవుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను18 నెలల కాలంలో అమలు చేసిన పాపాన పోలేదని, మళ్లీ తెలంగాణలోఆత్మహత్యల ఆకలికేకలు మొదలయ్యాయని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజక వర్గం కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పోరేటర్లు చెన్నం మధు, సోదాకిరణ్, యిమ్మడి లోహిత, స్వరూపరాణి, మాజీ కార్పోరేటర్ జోరిక రమేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు జానకి రాములు, పోలపల్లి రామ్మూర్తి, దూలం వెంకన్న, రఘు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.