హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 7: మిగ్జాం తుఫాన్ తెచ్చిన చలితో ఉమ్మడి జిల్లా ప్రజలు గజగజ వణుకుతున్నారు. మూడురోజులుగా చిరుజల్లులు కురుస్తుండడంతోపాటు చలిగాలులు వీస్తుండడంతో బయటకు రావాలంటే బెంబేలెత్తుతున్నారు. చలి తీవ్రరూపం దాల్చడంతో ప్రతి ఒక్కరూ ఉన్నిదుస్తులు ధరించి ఉపశమనం పొందుతున్నారు. తుఫాన్ కారణంగా పెరిగిన చలితో ప్రజలు ఉక్కిరికిబిక్కిరవుతున్నారు. తెరిపిలేకుండా చలిగాలులు వీస్తుండడంతో ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గురువారం వరకు వాతావరణం మరింత చల్లబడడంతో ఎటు చూసినా ప్రజలు స్వెటర్లు, జర్కిన్లు, టోపీలు ధరించి బయట రావడం కనిపించింది. చలికారణంగా పల్లె, పట్టణం తేడాలేకుండా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మధ్యాహ్నం సైతం సూర్చుడి జాడ కనిపిండం లేదు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సైతం ఇప్పుడు స్వెట్టర్లు ధరించే విద్యాసంస్థలకు వెళ్తున్నారు. చలి తీవ్రత ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో రక్షణ కోసం ఉలన్ (ఉన్ని) దుస్తుల కొనుగోళ్లు పెరిగాయి.
స్వెటర్లు, జర్కిన్లకు గిరాకీ
నగరంలోని వివిధ ప్రాంతాల్లో టిబెట్ దేశస్తులు స్వెటర్ల దుకాణాలు ఏర్పాటు చేశారు. హనుమకొండలోని పాత మున్సిపల్ మైదానంలో షెడ్లు వేసుకొని ఉన్నిదుస్తులు విక్రయిస్తున్నారు. హనుమకొండ చౌరస్తా, సెంట్రల్‌జైలు, ఎంజీఎం రోడ్డు, ములుగురోడ్డులో అమ్మకాలు జరుపుతున్నారు. చలితీవ్రత పెరగడంతో ఉన్ని దుస్తుల వ్యాపారానికి గిరాకీ పెరిగింది. వివిధ రకాల స్వెటర్లు, జర్కిన్లు, రగ్గులు, శాలువాలు, చిన్న పిల్లల మంకీ క్యాప్‌లు, చెవులకు కట్టుకునే ఊలు వస్ర్తాలు జోరుగా అమ్ముడవుతున్నాయి. గ్లౌజులు, టోపీలు, మాస్కులు, స్కార్ఫ్‌లు, సాక్సులు అందుబాటులో ఉన్నాయి. ధర రూ.300 నుంచి రూ.1500 వరకు ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.
చలి ఎక్కువ పెడతాంది..
మూడు రోజులుగా చలి ఎక్కువ పెడతాంది. తుఫాన్ కారణంగా వణుకు వస్తోంది. బయటకు రావాలంటే స్వెటర్లు, జర్కిన్లను వేసుకొని వస్తున్నం. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు చలికి గజగజ వణుకుతున్నరు. దీన్ని తట్టుకునేందుకు అందరూ వెచ్చని దుస్తులను వేసుకుంటున్నారు. పిల్లలకు స్వెటర్లు కొనేందుకు ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చిన.
– గుంకటి కిరణ్‌కుమార్, హనుమకొండ
స్వెటర్ కొనేందుకు వచ్చిన
చలి బాగ ఉండడంతో స్వెటర్ కొనేందుకు వచ్చిన. బయటకు రావాలంటే ఇబ్బందిగ ఉంది. తుఫాన్‌తో వణుకు పుడుతోంది. మూడురోజులుగా ఎండ రావడం లేదు. చలి నుంచి కాపాడుకు నేందుకు స్వెటర్, మాస్కు పెట్టుకోవాల్సి వస్తోంది.
– మంజుల, హనుమకొండ
గిరాకీ బాగుంది..
నా చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం చలికాలంల టిబెట్ నుంచి ఇక్కడి వస్తున్నం. హను మకొండ పాతమున్సిపల్ మైదానంలో స్వెటర్లు, జర్కిన్లు, శాలువాలు, గ్లౌసులు, సాక్సులు అమ్ముతున్నం. వ్యాపారం అనుకున్న స్థాయిలో ఉండడం లేదు. తుఫాన్‌తో చలి తీవ్రత ఎక్కువగ ఉంది. ఇప్పుడు గిరాకీ పెరిగింది. గతం కంటే ఇప్పుడు ఫర్వాలేదు.
– కర్మ, వ్యాపారి, టిబెటెన్