హనుమకొండ, నవంబర్ 19 : ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వర్లను చేసేందుకు కంకణబద్ధులమై ఉన్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక్కడ స్టాళ్లను పెట్టిన మహిళలు అదానీ, అంబానీలను తలద న్నేలా వ్యాపారంలో వృద్ధిలోకి వస్తారని చెప్పారు. అంబానీ, అదానీలకు పోటీగా ఆడబిడ్డలకు సౌరవిద్యుత్ వ్యాపారం ఇచ్చేందుకు కృషి చేస్తున్నా మని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మంగళవారం వరంగల్ నగరంలో పర్యటించారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో హనుమకొండ కుడా గ్రౌండ్స్‌లోని హెలిప్యాడ్ వద్దకు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకొని పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అకడినుంచి కాళోజీ కళాక్షేత్రానికి చేరుకొని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమారతో కలిసి ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి కళాక్షేత్ర భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత హనుమకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించి రూ. 4601.15 కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. భవనాన్ని ప్రారంభించారు.
ఆ తర్వాత కళాక్షేత్ర భవన కింది అంతస్తులో కాళోజీ ఫొటోలు, పురసారాలు, వ్యక్తిగత వస్తువులతో ప్రదర్శించిన ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. అనంతరం ఆడిటోరియంలో కాళోజీ జీవిత విశేషాలతో రూపొందించిన లఘుచిత్రాన్ని కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు వీఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం వీక్షించారు. అకడి నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ మహిళా శక్తి విజయోత్సవ సభకు వెళ్లారు. ముందుగా మైదానంలో స్టాల్స్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలతో ముచ్చటించి ఉత్పత్తులు, వ్యాపారం తదితర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే 22 మహిళా సమాఖ్య భవనాలను వర్చువల్ విధానంలో ప్రారంభించి, ఒక్కో భవనాన్ని రూ.5 కోట్లతో నిర్మించినన్నుట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంను స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాలువాలతో సత్కరించారు.
అనంతరం వేదికపైకి చేరుకొని మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఇందిరాగాంధీ 107వ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత సీఎంతో పాటు మంత్రులు ప్రసంగించారు. మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్ల కేటాయింపు, ఉత్పత్తిపై డిస్కంల సీఎండీలతో, ఆర్టీసీ అద్దె బస్సులను మహిళలకు కేటాయించే విషయంలో ఆర్టీసీ ఎండీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకున్నారు. అలాగే ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లా మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలకు సంబంధించిన చెక్కులు అందజేశారు. రాష్ట్రంలోని 2లక్షల 54వేల 864 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.21వేల 466 కోట్ల 58 లక్షల చెక్కులను అందజేశారు.
వివిధ జిల్లాల మహిళా సంఘాల ప్రతినిధులకు లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ రాజకీయ సలహాదారు కే కేశవరావు, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమా రి, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి అజిత్‌రెడ్డి, ఎంపీలు బలరాంనాయక్, కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యేలు నా యిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహ రి, రేవురి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగ రాజు, యశస్వినీరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, మురళీనాయ క్, కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ఎంఏయూడీ ప్రిన్సిపాల్ సెక్రటరీ దాన కిషోర్, రోడ్ల భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, సమాచార శాఖ కమిషనర్ హరీష్, విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, పీ ప్రావీణ్య, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వి ని తానాజీ వాకడే, ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి అధికారులు, రైఫిల్ షూటర్ ఇషాసింగ్, బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొన్నారు.
బల్దియాకు రూ.187 కోట్లు విడుదల
వరంగల్, నవంబర్ 19 : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.187.42 కోట్లు విడుదల చేసింది. ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధించిన నిధుల విడుదలకు ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ స్కీమ్‌లకు సంబంధించి గ్రాంట్ రూపేణా మంజూరు చేసింది. రెండు రోజుల క్రితం అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.4170 కోట్లు, బల్దియా పరిపాలన భవనం కోసం రూ.32.50 కోట్లు మంజూరు చేసింది.