తొర్రూరు/వర్ధన్నపేట/ఎల్కతుర్తి, ఏప్రిల్ 19 : ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. సభకు సూర్యాపేట నుంచి ఎల్కతుర్తి సభకు 30 ఎడ్లబండ్లు ర్యాలీగా రానున్నాయని చెప్పారు. 23న తొర్రూరుకు, 26న రాత్రి వరకు వర్ధన్నపేటకు చేరుకుంటుందని తెలిపారు. ర్యాలీగా వచ్చే వారి కోసం తొర్రూరులో శ్రీనివాసగార్డెన్‌లో, వర్ధన్నపేట సమీపంలోని ఇల్లంద కంఠమహేశ్వరస్వామి ఆలయంలో బస చేసేందుకు గాను శనివారం సూర్యాపేట నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం గుప్పెడు మందితో పోరాటాన్ని ఉద్యమనేత కేసీఆర్ ప్రారంభించి ప్రత్యేక తెలంగాణ సాధించారన్నారు.
పదేళ్ల పాటు తెలంగాణ ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశాడని గుర్తుచేశారు. రైతులతో పాటు అన్ని కులాలకు కూడా చేయూతనిచ్చేలా సంక్షేమ పథకాలను అమలు చేశారని వివరించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అందుకని ప్రజలు మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఎల్కతుర్తి సభకు వచ్చేందుకు ఊరూవాడ ఏకమై వస్తున్నందున రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. కేసీఆర్ సభలో పార్టీ శ్రేణులకు, ప్రజలకు అనేక విషయాలు వివరిస్తారన్నారు. పార్టీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో తరలిరావాలని జగదీశ్వర్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో తొర్రూరు పార్టీ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పటి అంజయ్య, పట్టణ అధ్యక్షులు బిందు శ్రీనివాస్, పట్టణ వరింగ్ ప్రెసిడెంట్ ఏ.ప్రదీప్‌రెడ్డి, పార్టీ కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు ఎన్నమనేని శ్రీనివాసరావు, మణిరాజు, తూర్పాటి రవి, శంకర్, జైసింగ్, ఎసే అంకూస్, కాలునాయక్, రాయేశెట్టి వెంకన్న, జాటోత్ స్వామి, భాసర్, సోమలింగం, డిష్ శ్రీనివాస్, ఎల్పుకొండ రమేశ్ పాల్గొన్నారు.కాంగ్రెస్‌కు ఓట్లేసిన ప్రజలే తద్దినం పెట్టాలని చూస్తున్నరు
రజతోత్సవ సభతోనే ప్రభుత్వ పతనం ప్రారంభం
దుర్మార్గపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసిన ప్రజలే ఏడాదిలో తద్దినం పెట్టాలని చూస్తున్నారని, అంత కసితో ప్రజలు ఉన్నారని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, వొడితెల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గ్యాదరి కిషోర్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు వాసుదేవారెడ్డి, నాగుర్ల వెంకన్న, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో భావన చూస్తుంటే రజతోత్సవ సభ కాదు ప్రభుత్వ వ్యతిరేక సభగా మార్చుకున్నారని తెలిపారు.
ప్రభుత్వంపై ఉన్న కసిని, కోపాన్ని సభకు హాజరవడం ద్వారా వ్యక్తం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఓటు వేసి పొరపాటు చేశామని, తప్పు చేశామని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఆ కసితోనే సభకు హాజరవాలని చూస్తున్నారని వివరించారు. సంవత్సరంన్నర కాలంలో ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన పార్టీ చరిత్రలో మరే ప్రభుత్వం లేదన్నారు. మేము ఊహించినదానికంటే అత్యధికంగా ప్రజలు ఈ సభకు తరలివస్తారని, ఎక్కడా చూసిన సభ గురించే ప్రజలు చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి, వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం పాల్గొన్నారు.