హనుమకొండ, డిసెంబర్ 13: ఎన్నికల ముందు సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన రెగ్యులరైజ్ హామీని సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్య క్షుడు దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్కు ఎదుట ధర్నా చేస్తున్న ఉద్యోగుల వద్దకు వెళ్లి తమ మద్దతు ప్రకటించారు.
ఎనిమిది రోజులుగా తమ న్యాయపరమైన డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష, సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్‌రావు రాష్ట్రవ్యాప్తంగా తమ మద్దతు ప్రకటించారన్నారు.
త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వారి సమస్యలను లేవనెత్తుతుందని ఆయన తెలిపారు. సమగ్ర శిక్షా ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, వీరి సమ్మెకు పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పులి దేవేందర్‌తో పాటు పలు సంఘాలు తమ మద్దతు ప్రకటించాయి.