కాజీపేట, జూన్ 6 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు బీఆర్ఎస్ పార్టీని అణచివేయాలని చూస్తున్నాయని, పార్టీ నాయకులు, కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సిరికొండ ప్రశాంత్ అన్నారు. ప్రశాంత్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను శుక్రవారం కాజీపేట ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్కతుర్తిలో ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు వాహనాల్లో భారీగా తరలివెళ్తుండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఆటంకాలు సృష్టించాయన్నారు.
భూపాలపల్లి నుంచి సభకు వెళ్లే వాహనాలను ఉప్పల్ రైల్వేగేటు మీదుగా దారి మళ్లించి, ఉద్దేశపూర్వకంగా 2గంటలపాటు నిలిపివేసినట్లు తెలిపారు. దాదాపు పది కిలోమీటర్లు వేలాది వాహనాలు నిలిచిపోయాయని తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ రైల్వే గేట్‌వద్ద ఆందోళన చేయడంతో రైల్వే అధికారులు కొద్దిసేపటి తర్వాత గేటు తెరిచారని చెప్పారు. రైల్వే పట్టాల వద్ద ఆందోళనను చేపట్టినందుకు ఆర్పీఎఫ్ పోలీసులు 14మంది బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్‌లో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పతదని హెచ్చరించారు.
కాగా, ఉప్పల్ రైల్వేస్టేషన్ సమీపంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించినందుకు సిరికొండ ప్రశాంత్, తాటి జనార్దన్, గురుకుంట్ల కిరణ్, ఎర్ల రాజు, కంచెర్ల ప్రకాశ్, శశికాంత్ గౌడ్, బియాని పూర్ణను మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశామని, మరికొందరు పరారీలో ఉన్నట్లు కాజీపేట ఆర్ఫీఎఫ్ ఇన్స్పెక్టర్ చటర్జీ తెలిపారు. వీరిపై ఆర్పీఎఫ్ యాక్టు ప్రకారం నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.