మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 21 : అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలను ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ద్రోహం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం మహబూబాబాద్‌లోని ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్‌లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు రుణమాఫీలో అనేక లోపాల వల్ల చాలా మందికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఏ గ్రామంలో చూసి నా రుణమాఫీ కాని రైతులే ఎక్కువ ఉన్నారని, వారు ప్రతి రోజూ బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగినా సమస్యలను మాత్రం ప్రభుత్వం పరిష్కరించడం లేదన్నారు.
వరంగల్, మరిపెడలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఇప్పుడు మాత్రం రుణమాఫీకి అనేక కొర్రీలు పెట్టి రైతులకు మూడు విడతల్లో మాఫీ చేసి కొంతమందికి మాత్రమే చేసి కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సార్లు రుణమాఫీ పైన మాట మార్చుతూ వచ్చిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లక్ష లోపు 36లక్షల మందికి రుణమాఫీ చేస్తే, కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ అని మోసం చేసి కేవలం 22లక్షల మందికి రుణమాఫీ చేసిందని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారిని మభ్య పెడుతూ తీవ్ర అన్యాయం చేస్తున్నారని, ఆయన పాలనపైన ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఎకరాకు 10 వేలే ఇస్తుందని, రైతు భరోసా పెట్టి ఎకరానికి 15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. రైతు భరోసా విధివిధానాల అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకు మాత్రం రైతు రుణమాఫీ అవుతుందని, రాష్ట్రంలో ఉన్న నిరుపేద రైతులకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయలేదన్నారు. రైతులకు రేషన్, ఆధార్ కార్డు సరిగా లేదని, ఒకే కుటుంబం అని అనేక రకాలు తప్పులను చూపి రుణాలను మాఫీ చేయలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను, మేధావులను ఇబ్బంది పెట్టే భాష వాడడం సరి కాదని, వెంటనే తన భాషను మార్చుకోవాలన్నారు.
కాంగ్రెస్ పార్టీకి దళిత, గిరిజన, మైనార్టీ ప్రజలు ఓట్లు వేసి రేవంత్‌రెడ్డిని సీఎం చేస్తే వారి సమస్యలను పరిష్కరించకుండా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఉద్యమం చేసి సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ గత 10 సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రతి నిరుపేదకు న్యాయం చేశారన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఒక స్వర్ణయుగంగా కొనసాగిందని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని, చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని, అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణ మాఫీ చేయాలని నేడు జిల్లా, నియోజకవర్గం, మండలస్థాయి, గ్రామ స్థాయిలో అన్ని చోట్ల ధర్నాలు, నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.