హనుమకొండ, జులై 10 : నిధులు లేవు, అప్పులు పుట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అంటుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు మాత్రం మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే వరంగల్ పశ్చిమ నియోజక వర్గం అభివృద్ది జరిగిందనడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు అన్నారు. అసలు నిధులే లేనపుడు అభివృద్ధికి నిధులు ఎక్కడి నుంచి ఎన్ని తెచ్చారు.. ఎక్కడ అభివృద్ధి చేసారో వెల్లడించాలని డిమాండ్ చేసారు. వరంగల్ పశ్చిమ నియోజక వర్గం అభివృద్ది విషయంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడారు. పద్దెనమిది నెలలలోనే వరంగల్ పశ్చిమ నియోజక వర్గం అభివృద్ది చేసామని చెపుతున్న కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఎన్ని నిధులు తెచ్చారు.. చేసిన అభివృద్ధి ఏంటో ఆధారాలతో వెల్లడించాలని కార్పొరేటర్ చెన్నం మధు డిమాండ్ చేసారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి వరంగల్ నగరానికి అమృత్, హృదయ్, స్మార్ట్ సిటీలో ఎంపికయ్యేలా చేసారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన నరగ అభివృద్ధిపై చర్చకు మేము సిద్దం.. దమ్ముంటే మీరు చర్చకు రావాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్, లోహిత రాజు, సంకు నర్సింగ్, సోదా కిరణ్, పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, నాయకులు ఇమ్మడి రాజు, సదాంత్, చిన్న, కనకరాజు, సోని, మహమూద్, దేవమ్మ, రఘు, ఖాదర్, రామ్మూర్తి, బచ్చు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.