వరంగల్, జూలై 9 : గ్రేటర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ నేతృత్వంలో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు మంజూరు చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీకి కార్పొరేటర్ చైర్మన్‌గా ఉండాల్సి ఉండగా దానిని తుంగలో తొక్కారని, విపక్ష కార్పొరేటర్ల డివిజన్లలో కనీస సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు.
అలాగే కార్పొరేటర్లను పిలవకుండానే అధికార పార్టీ నేతలు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నారని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తలకు, అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఇళ్లు కేటాయించి అర్హులకు మంజూరు చేయలేదని, వీటిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరారు. అలాగే రూ.1.50 కోట్లతో చేపట్టిన కౌన్సిల్ హాల్ పునరుద్ధరణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విచారణ పూర్తయ్యేదాకా బిల్లులు చెల్లించవద్దని కోరారు. కమిషనర్‌ను కలిసిన వారిలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, ఇమ్మడి లోహిత, సుంకరి మనీషా, దివ్యారాణి, సోదా కిరణ్, చెన్నం మధు, సుంకు నర్సింగ్ యాదవ్ ఉన్నారు.